ఏయూ వీసీ నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం

30 Nov, 2023 04:17 IST|Sakshi

స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం

విచారణ 8 వారాలకు వాయిదా

సాక్షి, అమరావతి:ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ (వీసీ) నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమంది. విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాద్‌రెడ్డి పనిచేసిన కాలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పిటిషనర్‌ ఇచ్చిన వినతిపత్రంపై ఛాన్సలర్‌ (గవర్నర్‌) తగిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రసాద్‌రెడ్డి వీసీగా ఉన్న సమయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్వ విద్యార్థుల సంఘం హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది పిచ్చయ్య వాదనలు వినిపిస్తూ.. ప్రసాద్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్నారు. ఎలాంటి నోటిఫికేషన్‌ ఇవ్వకుండా.. ప్రకటన జారీ చేయకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారన్నారు. అడ్డగోలుగా చెట్లను నరికేయించారని తెలిపారు. తిరిగి ప్రసాద్‌రెడ్డినే వీసీగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

ప్రసాద్‌రెడ్డి తీరుపై ఛాన్సలర్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఛాన్సలర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నవంబర్‌ 1న ఫిర్యాదు చేసి, స్పందించేందుకు తగిన సమయం ఇవ్వకుండా నవంబర్‌ 10న ఎలా పిల్‌ దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ప్రసాద్‌రెడ్డినే తిరిగి వీసీగా నియమిస్తున్నారా? అని విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను తెలుసుకుని పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతానని విశ్వవిద్యాలయం న్యాయవాది వి.సాయికుమార్‌ తెలిపారు.

వీసీగా ప్రసాద్‌రెడ్డి కాల పరిమితి 24తో ముగిసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఛాన్సలర్‌కు తగిన సమయం ఇద్దామని తెలిపింది. విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో పిచ్చయ్య స్పందిస్తూ.. వీసీ నియామక ప్రక్రియను నిలుపుదల  చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. 

మరిన్ని వార్తలు