నేటి నుంచి వైజాగ్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ 

18 Sep, 2023 04:10 IST|Sakshi

ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహణ 

హాజరుకానున్న శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌ గోల్ఫర్స్‌ 

విశాఖ స్పోర్ట్స్‌:  ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ టూర్‌ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘వైజాగ్‌ ఓపెన్‌ గోల్ఫ్‌ 2023’ ప్రారంభం కానుంది. ప్రొఫెషనల్‌ గోల్ఫ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో పీజీటీఐ టోర్నీలు నిర్వహిస్తుండగా, విశాఖ ఈస్ట్‌ పాయింట్‌ గోల్ఫ్‌ క్లబ్‌ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తొలి రోజు ప్రాక్టీస్‌ రౌండ్స్‌  రెండో రోజు ప్రోటోర్నీ జరగనున్నాయి.

20 నుంచి 23వ తేదీ వరకు నాలుగు రౌండ్ల పాటు స్ట్రోక్‌ ప్లే ప్రధాన టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్‌ఎన్‌ రాజు మాట్లాడుతూ ప్రోటోర్నీని వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెందార్కర్‌ ప్రారంభించనుండగా.. విజేతలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బహుమతులు అందించనున్నారన్నారు.

భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మేటి గోల్ఫర్స్‌ 126 మంది ఈ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్‌మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించారు. యూరోస్పోర్ట్స్, సోషల్‌ మీడియా, దూరదర్శన్‌ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందన్నారు. 1984లో నిరి్మంచిన ఈపీజీసీ ఉత్తమ పునఃనిర్మాణ గోల్ఫ్‌కోర్స్‌గానూ గతేడాది అవార్డు అందుకుందని చెప్పారు. 
 

మరిన్ని వార్తలు