చెత్త సేకరణపై నిఘా.. సిటిజన్‌ యాప్‌ను రూపొందించిన పంచాయతీరాజ్‌ శాఖ

3 Sep, 2022 08:26 IST|Sakshi

ప్రతీ కుటుంబంలోని ఒకరి ఫోనులో యాప్‌ డౌన్‌లోడ్‌కు చర్యలు 

ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు 67.08 లక్షల మంది   

చెత్తను సేకరించారా లేదా తెలపాలని రోజూ ప్రతీ ఇంటికీ మెసేజ్‌ 

లేదని బదులు వస్తే వెంటనే చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ‘క్లాప్‌’మిత్రలు రోజూ చెత్తను సేకరిస్తున్నారా లేదా అన్నది తెలుసుకునేందుకు పంచాయతీరాజ్‌ శాఖ యాప్‌ అ్రస్తాన్ని ప్రయోగిస్తోంది. ఇందుకోసం ‘సిటిజన్‌ యాప్‌’ను రూపొందించింది. దీనిని ప్రతీ కుటుంబంలో స్మార్ట్‌ఫోన్లు ఉన్న వారితో పంచాయతీ కార్యదర్శులు, క్లాప్‌మిత్ర (క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌)లు డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 99,84,421 కుటుంబాలు ఉండగా, ఇప్పటివరకు 67,08,960 మంది తమ ఫోన్లలో ఆ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. మిగిలిన కుటుంబాల వారికీ ఆ యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎనీ్టఆర్, తూర్పు గోదావరి, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో అత్యధిక కుటుంబాలు  ఈ యాప్‌ను ఇప్పటికే డౌన్‌లోడ్‌ చేసుకున్నాయి.  

బదులిచ్చేవారు తక్కువే.. 
మరోవైపు.. చెత్త సేకరణపై పంపే మెసేజ్‌లకు ప్రతిస్పందిస్తున్న వారి సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు పంచాయతీరాజ్‌ శాఖాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 70 లక్షల ఇళ్ల నుంచి రోజూ చెత్త సేకరణ చేస్తున్నట్లు వారు తెలిపారు. వీటిలో దాదాపు 50 లక్షల కుటుంబాలకు పైగానే రోజూ మెసేజ్‌లు పంపుతున్నామని.. కానీ, బదులిస్తున్న వారి సంఖ్య ఐదువేలలోపే ఉంటోందన్నారు. 20 రోజుల క్రితమే ఈ యాప్‌ ప్రక్రియ మొదలైందని.. అందరూ దానిపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవడానికి మరో రెండు మూడు నెలల సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అదే జరిగితే గ్రామాల్లో చెత్త సేకరణకు యాప్‌ పూర్తిస్థాయిలో దోహదపడుతుందని వారు చెబుతున్నారు.

చెత్త సేకరణపై రోజూ మెసేజ్‌లు.. 
ఇక సిటిజన్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతీ ఫోనుకు ‘ఈ రోజు మీ ఇంటి నుంచి చెత్తను సేకరించారా’ అని ప్రశ్నిస్తూ ‘ఎస్‌’ లేదా ‘నో ’ చెప్పాలని పంచాయతీరాజ్‌ శాఖ మెసేజ్‌ పంపుతోంది. ఎవరైనా ‘నో’ అని బదులిస్తే, పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి సంబంధిత జిల్లా పంచాయతీ అధికారి ద్వారా ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి, క్లాప్‌మిత్ర నుంచి వివరణ కోరతారు. అదే రోజు లేదా మర్నాడు ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేలా మండల, జిల్లాస్థాయి అధికారులు చర్యలు చేపడతారు.
చదవండి:‘బల్క్‌’ కుట్ర బహిర్గతం.. టీడీపీ పన్నాగం బట్టబయలు

మరిన్ని వార్తలు