Pawan Kalyan: బాబు కోసం పవన్‌ తహతహ 

9 May, 2022 03:46 IST|Sakshi

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైఎస్సార్‌సీపీ మళ్లీ గెలుస్తుందన్న పవన్‌ కల్యాణ్‌ 

పొత్తుపై చంద్రబాబు నేరుగా ప్రతిపాదిస్తే స్పష్టత ఇస్తామని వెల్లడి 

టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు 

ఆ విషయం తనకు తెలియదని దాటవేసిన పవన్‌  

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమన్వయంతోనే పొత్తుల ఎత్తులు 

2019 నుంచి టీడీపీకి ఘోర పరాజయాలు..  

చెల్లాచెదురైన టీడీపీ శ్రేణుల్లో భరోసా కోసమే పొత్తుల డ్రామా 

ఆవిర్భావం నుంచే బాబు ప్రయోజనాల కోసమే పనిచేస్తున్న జనసేన 

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌లు సమన్వయంతోనే పొత్తుల ఎత్తులు వేస్తున్నట్లు పై వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. టీడీపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆపార్టీ సహ ఇన్‌ఛార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ తెగేసి చెబుతున్నారు. అదే విషయాన్ని తాజాగా వీర్రాజు మళ్లీ ప్రకటించారు. అయితే ఈ విషయం తనకు తెలియదంటూ ఆ పార్టీతో పొత్తులో ఉన్న పవన్‌ దాటవేశారు.

2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన టీడీపీ.. ఆ తర్వాత జరిగిన పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, పురపాలక ఎన్నికల్లో దారుణంగా ఓడిపోవడంతో ఆపార్టీ శ్రేణులు చెల్లాచెదురయ్యాయి. మూడేళ్లుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. సుపరిపాలనతో ప్రజల్లో నానాటికీ బలపడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని నిలువరించడం సాధ్యం కాదనే భావనకు వచ్చిన టీడీపీ నైరాశ్యంలో కూరుకుపోయింది. మిగిలిన టీడీపీ శ్రేణుల్లో నైతిక స్థైర్యం నింపడానికి ఎన్నికలకు రెండేళ్ల ముందే పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు పొత్తుల డ్రామాకు తెరతీశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్రబాబు ప్రయోజనాల కోసమే..  
జనసేన ఆవిర్భావం నుంచి టీడీపీతో విడిపోయిన దాఖలాలు లేవని.. చంద్రబాబు అవసరాన్ని బట్టి.. బహిరంగ పొత్తు, లోపాయికారి ఒప్పందాలతో ఆ రెండు పార్టీలు సమన్వయంతో పని చేస్తున్నాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకుండా.. టీడీపీ–బీజేపీ కూటమికి బేషరతుగా పవన్‌ కళ్యాణ్‌ మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందు బీజేపీకి టీడీపీ కటీఫ్‌ చెప్పడంతో పవన్‌ కళ్యాణ్‌ అదే పాటించారు.

2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీని మళ్లీ అధికారంలోకి తేవాలనే చంద్రబాబు లక్ష్యం మేరకు.. బీఎస్పీ, సీపీఐ, సీపీఎంతో జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పోటీ చేసిన రెండు చోట్ల.. ఆ పార్టీని గెలిపించేందుకు టీడీపీ లోపాయికారీగా మద్దతు ఇచ్చింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించాక.. చంద్రబాబు కనుసైగల మేరకు పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరయ్యారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నామని ప్రకటించారు. ఇదంతా చంద్రబాబు ప్రతిపాదన మేరకే పవన్‌ కళ్యాణ్‌ అడుగులు వేస్తున్నారు.  

► జనసేనతో పొత్తు పెట్టుకోవాలని మనకు ఉన్నా, వారికీ ఉండాలి కదా.. వన్‌ సైడ్‌ లవ్‌తో ఫలితం ఉండదు. రెండు వైపులా ప్రేమ ఉంటేనే ఫలిస్తుంది. 
– జనవరి 7న కుప్పం పర్యటనలో చంద్రబాబు 

► ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తీసుకుంటా. వైఎస్సార్‌సీపీని గద్దె దింపడానికి అందరినీ కలుపుకుని వెళ్తాం. ప్రభుత్వంపై పోరాటం చేయడానికి బీజేపీ ఇచ్చే రోడ్‌ మ్యాప్‌ కోసం ఎదురుచూస్తున్నా. 
– మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్‌ కళ్యాణ్‌ 

► ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలసి రావాలి. ప్రజా ఉద్యమం రావాలి. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది. అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధం. 
– ఈనెల 6న తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో చంద్రబాబు 

► ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసే బాధ్యత తీసుకుంటానని పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే చెప్పారు. టీడీపీపై పొత్తు నిర్ణయం పవన్‌ కళ్యాణ్‌ తీసుకుంటారు. 
– ఈనెల 6న కర్నూలులో జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ 

► ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే వైఎస్సార్‌సీపీ మళ్లీ గెలుస్తుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వం కోసమే పొత్తులు. చంద్రబాబు నేరుగా పొత్తును ప్రతిపాదిస్తే అప్పుడు స్పష్టత ఇస్తా.     
– ఆదివారం నంద్యాల జిల్లా పర్యటనలో పవన్‌ కళ్యాణ్‌ 

► పొత్తులపై వైఎస్సార్‌సీపీ ఎగిరెగిరి పడుతోంది. అవసరమైన మేరకు పొత్తులు పెట్టుకుంటాం. 
    – ఆదివారం తిరుపతి జిల్లాలో చంద్రబాబు 

మరిన్ని వార్తలు