ప్రపంచంలోనే అతి పెద్దది.. ఏపీలో ఎలక్ట్రిక్‌ వాహన యూనిట్‌

18 Nov, 2023 04:16 IST|Sakshi

జర్మనీకి చెందిన ప్రముఖ సంస్థ పెప్పర్‌ మోషన్‌ ప్రకటన

రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం.. పుంగనూరులో యూనిట్‌

సీఎం జగన్‌ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు చూసి ఏపీలో పెట్టుబడి

రూ.4,640 కోట్ల పెట్టుబడి.. 8,080 మందికి ఉపాధి

టెస్లా మాదిరి ఇంటిగ్రేటెడ్‌ వర్టికల్‌ ప్రొడక్షన్‌ ఫెసిలిటీ

20 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం బ్యాటరీలు, ఎలక్ట్రిక్‌ బస్సులు, ట్రక్కులు తయారీ

ఈనెలాఖరులో పనులు ప్రారంభం

2025కి వాణిజ్య ఉత్పత్తి మొదలు

సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్‌ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్‌ మోషన్‌ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్‌ మోషన్‌ జీఎంబీహెచ్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాలు కేటాయించడంతో పాటు పలు రాయితీలను ఇచ్చింది. 

సుమారు రూ.4,640 కోట్లు (600 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్‌ బస్‌ అండ్‌ ట్రక్‌ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్‌ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 

పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తీసుకుంటున్న ప్రగతిశీల ఆరి్థక విధానాలకు తోడు పోర్టులు, పారిశ్రామిక మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరుస్తుండటంతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నట్లు పెప్పర్‌ మోషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవో ఆండ్రియాస్‌ హేగర్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్‌ ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 

2025 నాటికి ఉత్పత్తి ప్రారంభం 
ఈ నెలాఖరులో యూనిట్‌ నిర్మాణం ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్‌ చేరుకుంటుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఎలక్ట్రిక్‌ వాహనాల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని, ఇది తమ వ్యాపార విస్తరణకు కలిసొచ్చే అంశమని పెప్పర్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు