Alluri Sitarama Raju Birth Anniversary: భారత్‌ను ఆపేదెవరు!

5 Jul, 2022 03:40 IST|Sakshi
భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సభలో విల్లు, బాణాలతో ప్రధాని మోదీ. చిత్రంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అల్లూరి స్ఫూర్తితో పురోగమిద్దాం.. యువత ముందుకొస్తేనే భవిత: ప్రధాని నరేంద్ర మోదీ

కొత్త అవకాశాలను అన్వేషిస్తూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మన యువతరానికి ప్రేరణ

చిరు ప్రాయంలోనే సవాళ్లకు ఎదురొడ్డి సాగారు

వందేమాతరంతో సరితూగేలా.. అల్లూరి ‘మనదే రాజ్యం’ 

ఆంధ్రప్రదేశ్‌.. దేశ భక్తుల గడ్డ, వీరుల నిలయం

సమరయోధుల కలలకు అనుగుణంగానే మా 8 ఏళ్ల పాలన

అందరికీ సమానావకాశాలు దక్కేలా ప్రతి కార్యక్రమం

త్యాగ ఫలాలను గుర్తు చేసేందుకే ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సభలో ప్రధాని మోదీ 

భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహం ఆవిష్కరణ

ఆదివాసీల వారసత్వాన్ని కళ్లకు కట్టేలా లంబసింగిలో మ్యూజియం 

అల్లూరి సీతారామరాజు భారతదేశ సంస్కృతి, పరాక్రమం, ఆదర్శాలు, విలువలకు ప్రతీక. ఆదివాసీల హక్కులు, దేశ ప్రజల స్వేచ్ఛ కోసం చిరుప్రాయంలోనే తన జీవితాన్ని దేశమాతకు అర్పించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సవాళ్లను ఎదుర్కొంటూ అభివృద్ధి దిశగా ముందుకెళ్లడంలో అల్లూరి జీవితాన్ని యువత ప్రేరణగా తీసుకోవాలి. 
–  ప్రధాని నరేంద్ర మోదీ 

లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి స్వతంత్ర భారతదేశం. అలాంటి త్యాగమూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి అనేక అగ్నికణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ త్యాగధనులు, పోరాట యోధుల్లో ఓ మహా అగ్నికణమే అల్లూరి సీతారామరాజు. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: అలనాడు అల్లూరి చూపిన సాహసం స్ఫూర్తితో 130 కోట్ల మంది ప్రజలంతా కలసికట్టుగా ‘దమ్ముంటే మా భారత్‌ను ఆపండి’ అనే నినాదంతో సవాళ్లను ఎదుర్కొంటూ పురోగమిస్తే మన దేశాన్ని ఎవరూ నిలువరించలేరని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాటి పోరాటాలకు దేశ యువత నాయకత్వం వహించిన మాదిరిగానే ఆధునిక భారత్‌లోనూ యువత సరికొత్త అవకాశాలు, ఆలోచనలు, మార్గాలను అన్వేషిస్తూ దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. స్వాత్రంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సమరయోధులను స్మరించుకుంటూ నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా అల్లూరి 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు సోమవారం భీమవరం వచ్చిన ప్రధాని స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు.

అల్లూరి జయంతి వేడుకలు, రంప తిరుగుబాటు ఉద్యమం 100 ఏళ్ల వార్షికోత్సవాన్ని ఏడాది పొడవునా దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్టు ప్రధాని ప్రకటించారు. అల్లూరి జన్మస్థలమైన పాండ్రంగి జీర్ణోద్ధరణ, చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ పునర్‌ నిర్మాణం, మోగల్లులో అల్లూరి ధ్యాన మందిరం నిర్మాణం చేపడుతున్నట్టు తెలిపారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో కలసి భీమవరంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని రిమోట్‌ విధానంలో ఆవిష్కరించారు. పెద అమిరం వద్ద నిర్వహించిన బహిరంగసభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి మాట్లాడారు.

‘మనదే రాజ్యం’... వందేమాతరం
స్వాతంత్ర సంగ్రామంలో యావత్‌ భారతావనికి స్ఫూర్తిదాతగా నిలిచి తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా.. అంటూ పౌరుషాన్ని రేకెత్తించిన తెలుగు జాతి యుగపురుషుడు, మన నాయకుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఈ నేలపై కలుసుకోవడం అదృష్టమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ‘మనదే రాజ్యం..’ అంటూ అల్లూరి ఇచ్చిన నినాదం  వందేమాతరం నినాదంతో సరితూగుతుందన్నారు. మన్యం వీరుడు అల్లూరి బ్రిటీషు వారికి ఎదురొడ్డి ‘మీకు చేతనైతే నన్ను నిలువరించండి..’ అంటూ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిల్చారన్నారు. 

యాధృచ్ఛికమే అయినా..
ప్రస్తుతం దేశం ముందున్న అనేక సవాళ్లను ఎదుర్కోవడంలో అలనాడు అల్లూరి చూపిన సాహసం స్ఫూర్తితో సాగితే ఎవరూ నిలువరించలేరని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో ఏకత్వమన్న మన సంస్కృతికి అల్లూరి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి, రంప తిరుగుబాటుకు వందేళ్లు పూర్తి అవుతుండడం, అదే సమయంలో ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాలు యాధృచ్ఛికంగా కలసి వచ్చాయన్నారు. స్వాతంత్య్ర సమర యోధుడి కుటుంబ సభ్యులను కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మన్యం వీరుడు అల్లూరికి ప్రధాని నివాళులర్పించారు.
గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని మోదీతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, సీఎం జగన్‌ 

ఆంధ్రప్రదేశ్‌.. దేశభక్తుల గడ్డ
ఆంధ్రప్రదేశ్‌ దేశ భక్తుల గడ్డ, వీరుల నిలయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్యతోపాటు కన్నెగంటి హనుమంతు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు లాంటి మహనీయులు, వీరులు పుట్టిన నేల అని కొనియాడారు. ఇక్కడ పుట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అంగ్లేయులపై పోరాడిన గొప్ప యోధుడని గుర్తు చేస్తూ వారి కలలను నెరవేర్చడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. వారు కలలుగన్నట్టుగా పేదలు, రైతులు, శ్రామికులు, వెనుకబడిన వర్గాలు, ఆదివాసీలు.. అందరికీ సమాన అవకాశాలు లభించేలా మన ఆధునిక భారతదేశం ఉండాలన్నారు. ఎనిమిదేళ్లుగా తమ ప్రభుత్వం ఆ దిశగా అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. 
సీఎం జగన్‌తో ముచ్చటిస్తున్న ప్రధానమంత్రి 

ఎన్నో త్యాగాల ఫలం..
స్వాతంత్య్ర పోరాటం అనేది కొద్ది సంవత్సరాలో, కొన్ని ప్రాంతాలో లేక కొద్ది మంది వ్యక్తుల చరిత్ర మాత్రమే కాదని.. దేశ నలుమూలలా అనేక మంది త్యాగాలు, ధృడ సంకల్పం, సాహసాల ఫలితమని ప్రధాని అభివర్ణించారు. స్వాతంత్య్ర ఉద్యమ చరిత్ర భిన్నత్వంలో ఏకత్వాన్ని పోలి ఉంటుందన్నారు. మహనీయుల త్యాగ ఫలాలను ఈ తరానికి గుర్తు చేసేందుకే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

లంబసింగిలో స్మారక మ్యూజియం
దేశంలోనే తొలిసారిగా ఆదివాసీల గౌరవాన్ని, వారసత్వాన్ని కళ్లకు కట్టేలా అరకు సమీపంలోని లంబసింగిలో అల్లూరి సీతారామరాజు స్మారక ఆదివాసీ స్వాతంత్య్ర సమర యోధుల మ్యూజియం నిర్మించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆజాదీ కా ఆమృత్‌ మహోత్సవ్‌ స్ఫూర్తికి అవి ప్రతీకలుగా నిలుస్తాయన్నారు. బిర్సా ముండా పుట్టిన రోజైన నవంబర్‌ 15వ తేదీని ‘రాష్ట్రీయ జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌’గా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సినీ నటుడు చిరంజీవితో ప్రధాని కరచాలనం 

వన ఉత్పత్తులపై ఆదివాసీలకే హక్కులు..
ఆదివాసీల కళలు, నైపుణ్యాలకు గుర్తింపు కల్పించేలా ‘స్కిల్‌ ఇండియా మిషన్‌’ ద్వారా యువతకు శిక్షణ ఇస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దశాబ్దాల నాటి పాత చట్టాలను సవరించి వన ఉత్పత్తులపై ఆదీవాసీలకే హక్కులు కల్పించామని చెప్పారు. కనీస మద్దతు ధరకు సేకరించే అటవీ ఉత్పత్తులను తమ ప్రభుత్వం 12 నుంచి 90కి పెంచిందన్నారు.

ఆదివాసీల ఉత్పత్తులు, కళాకృతులతో 3,000 వన గణ వికాస్‌ కేంద్రాలు,  50,000కిపైగా వన గణ స్వయం సహాయ çసంఘాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చదువుకునేలా ప్రోత్సహిస్తూ 750కిపైగా ఏకలవ్య పాఠశాలలను నెలకొల్పామన్నారు. కొత్త జాతీయ విద్య విధానం ద్వారా మాతృభాషలో విద్యా బోధనను ప్రోత్సహించడం ఆదివాసీలకు ప్రయోజనం చేకూర్చుతుందన్నారు.  

అల్లూరికి 125 మంది ‘మన్యం వీరుల’ నివాళి
పెద్దాపురంలో అల్లూరి వేషధారణలో ర్యాలీ నిర్వహిస్తున్న చిన్నారులు 

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని కాకినాడ జిల్లా పెద్దాపురంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. పెద్దా, చిన్నా కలిసి 125 మంది అల్లూరి వేషధారణలో భారీ ప్రదర్శన చేపట్టారు. ప్రజానాట్య మండలి, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, సీఐటీయూ, ఐద్వా, యూటీఎఫ్, మన పెద్దాపురం ఫేస్‌బుక్‌ టీం, ఎస్‌ఎంఎస్, పెద్దాపురం చిల్డ్రన్‌ క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.     
– పెద్దాపురం

మరిన్ని వార్తలు