మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం..

28 Jan, 2022 05:59 IST|Sakshi

ఆ మేరకు మహిళా పోలీస్‌ వ్యవస్థ రూపకల్పన 

తదనుగుణంగా శిక్షణ సిలబస్‌ ఖరారు

సాక్షి, అమరావతి: క్షేత్రస్థాయిలో కీలక భూమిక పోషించేలా గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు పోలీసు శాఖ సిద్ధమవుతోంది. కమ్యూనిటీ పోలీసింగ్‌ తరహాలో ఈ వ్యవస్థను తీర్చిదిద్దాలని నిర్ణయించింది. మహిళల భద్రత, కుటుంబ వివాదాల పరిష్కారం, సామాజిక అంశాలపై చైతన్యం కల్పించడం, ప్రభుత్వ పథకాల అమలు పర్యవేక్షణ తదితర కీలక బాధ్యతలను నిర్వర్తించేలా ఈ వ్యవస్థను రూపొందించనున్నారు.

ఇప్పటికే మహిళా పోలీసుల విధులు, బాధ్యతలపై ప్రభుత్వం మార్గదర్శకాలిచ్చింది. ఈ మేరకు వారికి తగిన శిక్షణ ఇచ్చేందుకు పోలీసు శాఖ ప్రణాళికను రూపొందించింది. రాష్ట్రంలో దాదాపు 15 వేల మంది వరకూ ఉన్న మహిళా పోలీసులకు త్వరలో శిక్షణ కార్యక్రమాన్ని పోలీసు శాఖ చేపట్టనుంది. రాష్ట్రంలోని 21 పోలీసు శిక్షణ కేంద్రాల్లో ప్రస్తుతం ఒక విడతలో 5 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు వసతులున్నాయి. వాటిని మరింత పెంపొందించి రెండు విడతల్లో 15 వేల మందికీ శిక్షణ పూర్తి చేయాలని భావిస్తోంది. ఒక విడతలో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారు.. అలా ఆరు నెలల్లో శిక్షణ పూర్తవుతుంది.

శిక్షణకు సిలబస్‌ ఖరారు 
శిక్షణ కాలంలో మహిళా పోలీసులకు వారి విధులు, బాధ్యతలపై అవగాహన కల్పిస్తారు. ప్రధానంగా పోలీసు చట్టాలు, న్యాయపరమైన అంశాలపై పట్టు సాధించేలా చేస్తారు. కుటుంబ వివాదాలు తమ దృష్టికి వచ్చినప్పుడు, బాధిత మహిళలు ఆశ్రయించినప్పుడు వారికి ఎలా మనోధైర్యం కల్పించాలి..  ఎలా మార్గనిర్దేశం చేయాలన్న అంశాలపై అవగాహన కల్పిస్తారు.

సైబర్‌ నేరాలకు గురికాకుండా, సామాజిక మాధ్యమాల్లోని వేధింపుల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను వివరిస్తారు. తద్వారా మహిళా పోలీసులు తమ పరిధిలోని మహిళలు, విద్యార్థినులు, ఇతరులకు మార్గనిర్దేశం చేయగలుగుతారన్నది పోలీస్‌ శాఖ ఉద్దేశం. అలాగే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణపైనా మహిళా పోలీసులకు శిక్షణ ఇవ్వనున్నారు.   మార్చిలో మొదటి విడత శిక్షణ తరగతులు ప్రారంభించాలని భావిస్తోంది.    

మరిన్ని వార్తలు