ఐపీఎల్ షురూ.. బెట్టింగ్‌ జోరు 

19 Sep, 2020 09:48 IST|Sakshi

నేటి నుంచి ఐపీఎల్‌–2020 

కాయ్‌ రాజా కాయ్‌ అంటున్న బుకీలు

జిల్లాలో జోరుగా పందాలు 

ప్రొద్దుటూరు క్రైం: ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఐపీఎల్‌–2020 సీజన్‌ రానే వచ్చింది. చిన్నా..పెద్దా ఎవరి నోట విన్నా ఐపీఎల్‌ మ్యాచ్‌ గురించే. కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన వారికి.. ఐపీఎల్‌ మస్త్‌ కాలక్షేపాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. క్రికెట్‌ అభిమానులకు ఇక 53 రోజుల పాటు పండగే అని చెప్పవచ్చు. దుబాయ్‌ వేదికగా శనివారం ముంబై ఇండియన్‌– చెన్నై సూపర్‌కింగ్‌ జట్ల మ్యాచ్‌లతో క్రికెట్‌ సమరం గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి నవంబర్‌ 10 వరకు పోటీలు జరగనున్నాయి. అయితే క్రీడా స్ఫూర్తిని పొందాల్సిన యువత.. జూదంగా చూస్తోంది. ఈ పరిణామం బుకీలకు కాసుల పంటగా మారింది. కరోనా దెబ్బకు ఇన్నాళ్లు పందెం రాయుళ్లు తోకముడిచారు. ఇప్పుడు మళ్లీ వారి ఆశలకు రెక్కలొచ్చినట్లు అయింది. జిల్లాలో ప్రొద్దుటూరు, కడప, జమ్మలమడుగు, దువ్వూరు, మైదుకూరు, ఎర్రగుంట్ల, రాజంపేట, రాయచోటితోపాటు అనేక ప్రాంతాల్లో క్రికెట్‌ పందాలు జోరుగా నిర్వహిస్తారు. గతంలో పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌ జాడ్యం పల్లెలకు పాకింది.  

ఫ్యాన్సీ పందాలే ఎక్కువ 
గతంలో గెలుపోటములపై మాత్రమే పందెం కాసేవారు. కానీ ప్రస్తుతం టాస్‌ వేసినప్పటి నుంచి బంతి బంతికి కడుతున్నారు. బుకీలు వారి పరిభాషలో దీన్ని ఫ్యాన్సీ బెట్టింగ్‌ అని పిలుచుకుంటారు. ఫ్యాన్సీ బెట్టింగ్‌ నిర్వహించే వారు క్రికెట్‌ మ్యాచ్‌లో ప్రతి బాల్‌ను చూడాల్సి వస్తుంది. ప్రతి ఓవర్‌లో కొట్టే సిక్స్‌లు, ఫోర్‌లపై బెట్టింగ్‌ హోరు కొనసాగుతుంది. బ్యాట్స్‌మన్‌ కొట్టే పరుగులపై కూడా పందెం కాస్తారు. ప్రారంభ ఓవర్‌ నుంచి చివరి వరకు మ్యాచ్‌ అనేక మలుపులు తిరుగుతుంది. పందెం కాసిన జట్టు పరుగులు కొడుతున్న సేపు ఫంటర్ల (పందెం కాసేవాళ్లు)లో ఆశలు చిగురిస్తుంటాయి. అయితే టప టపా వికెట్లు పడితే మాత్రం వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి. ఇలాంటి ఒత్తిళ్ల నడుమ కొందరు ఫంటర్లు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు జిల్లాలో గతంలో చోటు చేసుకున్నాయి.  

బెట్టింగ్‌లో యువత, విద్యార్థులు 
క్రికెట్‌ బెట్టింగ్‌లో ఎక్కువగా యువత, విద్యార్థులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్, డిగ్రీ చదివే విద్యార్థులు సైతం ఆకర్షితులవుతున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే ప్యాకెట్‌ మనీతో రహస్యంగా బెట్టింగ్‌ ఆడుతున్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ జరిగేటప్పుడు ఇంట్లో టీవీ ముందు కూర్చొని సెల్‌ఫోన్‌ ద్వారా డబ్బు పెడుతున్నారు. తమ పిల్లలు క్రికెట్‌ పందాలు ఆడే విషయం తల్లిదండ్రులకు తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఈ విషయం బయట తెలిస్తే  పరువు పోతుందనే ఉద్దేశంతో.. తమ పిల్లలు బాకీ పడ్డ డబ్బును వారు తీర్చేస్తున్నారు. యువకులు, విద్యార్థులను కొందరు బుకీలు కలెక్షన్‌ బాయ్‌లుగా ఉపయోగించుకుంటున్నారు. వారికి బైక్‌తో పాటు రోజు వారి ఖర్చుకు డబ్బు, ఆకర్షణీయమైన జీతం ఇస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు కొరియర్లుగా, సబ్‌బుకీలుగా పని చేస్తున్నారు.   

గుట్టుగా సాగుతున్న దందా
జిల్లాలోని అనేక ప్రాంతాల్లో క్రికెట్‌ దందా గుట్టుగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా మ్యాచ్‌ల సమయాల్లో రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌ సీజన్‌లో అయితే మరింత ఎక్కువగా నడుస్తుంది. కష్టం లేకుండా అడ్డదారిలో, సులభంగా డబ్బు సంపాదించవచ్చని అనేక మంది బెట్టింగ్‌ ఫీవర్‌కు బలైపోతున్నారు. బెట్టింగ్‌కు పాల్పడిన వారి నుంచి బుకీలు వెంటపడి డబ్బు వసూలు చేస్తున్నారు. డబ్బులు లేక కొందరైతే బైక్‌లు, బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. జిల్లాకు చెందిన అనేక మంది బుకీలు ఇతర ప్రాంతాల్లో ఉంటూ దందా కొనసాగిస్తున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు చెందిన షేఠ్‌లతో సంబంధాలు పెట్టుకొని రూ.కోట్లు గడిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులకు చిక్కకుండా సాగిస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల ద్వారానే ఎక్కువ మంది బెట్టింగ్‌ జూదం నిర్వహిస్తుండటంతో.. వారిని గుర్తించడం కష్టంగా మారిందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

కదలికలపై నిఘా..
జిల్లా వ్యాప్తంగా ఉన్న బుకీల చిట్టా పోలీసులు సేకరించినట్లు తెలుస్తోంది. వారి కదలికలపై నిఘా పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ఐపీఎల్‌ నేపథ్యంలో పోలీసులు గతంలో కేసులు నమోదైన వారిని పిలిపించి బైండోవర్‌  చేస్తున్నారు. బెట్టింగ్‌ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బెట్టింగ్‌ ఊబిలో పడి అనేక కుటుంబాలు చితికి పోతున్నాయి. పోలీసులు గట్టి చర్యలు తీసుకొని అలాంటి వారిని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.      

మరిన్ని వార్తలు