‘పాల వెల్లువ’కు కేంద్రం ప్రశంసలు 

17 Sep, 2023 04:33 IST|Sakshi

దేశంలోనే అత్యధికంగా ఏపీలో పాల సేకరణ ధర 

లీటర్‌కు గేదె పాలకు రూ.100, ఆవుపాలకు రూ.54కుపైగానే 

మెజార్టీ రాష్ట్రాల్లో రైతులకు తక్కువ చెల్లిస్తున్నారు 

ఏపీని ఆదర్శంగా తీసుకోవాలి 

జేవీపీ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని కేరళ సదస్సులో సూచన  

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ(జేవీపీ) పథకానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు వెల్లువెత్తాయి. జేవీపీ ప్రాజెక్టు ఆలోచన అద్భుతమని కేంద్రం  ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా ఏపీలో పాడి రైతులకు దేశంలోనే అత్యధిక పాలసేకరణ ధరలు దక్కుతున్నాయని పేర్కొంది. ఏపీని బెంచ్‌ మార్క్‌గా తీసుకొని పాడి రైతులకు గరిష్ట ధర చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాలకు సూచించింది.

పశు సంవర్ధక, డెయిరీ రంగాలపై కేరళలోని తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సదస్సులో జేవీపీ ప్రాజెక్టుపై ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ ఎండీ అహ్మద్‌ బాబు, పశుసంవర్ధక శాఖ డైరక్టర్‌ డాక్టర్‌ రెడ్నం అమరేంద్రకుమార్‌తో కలసి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.   – సాక్షి, అమరావతి

పాడి రైతులకు గిట్టుబాటు ధరే లక్ష్యం: అహ్మద్‌ బాబు 
సహకార డెయిరీ రంగాన్ని బలోపేతం చేయడం, పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2020 డిసెంబర్‌లో జగనన్న పాలవెల్లువ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అమూల్‌ సంస్థతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. గ్రామస్థాయిలో మహిళా పాడి రైతు సంఘాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. ఈ ప్రాజెక్టు ద్వారా లీటర్‌కు రూ.10 నుంచి 20 వరకు పాడి రైతులకు అదనపు లబ్ధి చేకూరుతోంది. మూ­డు జిల్లాలతో ప్రారంభమై ప్రస్తుతం 19 జిల్లాలకు విస్తరించింది.

400 గ్రామాలతో మొదలై 3,775 గ్రామాలకు విస్తరించింది. 14,845 మందితో మొద­లైన ఈ ఉద్యమంలో నేడు 3.61లక్షల మంది భాగస్వాములయ్యారు. రోజూ 85 వేల మంది సగటున 1.86 లక్షల లీటర్ల పాలు పోస్తున్నారు. మూడేళ్లలో పాల సేకరణ ధరలను ఎనిమిది సార్లు పెంచారు. గేదె పాల ధర లీటర్‌కు రూ.71.74 నుంచి రూ.­89.76కు, ఆవుపాల ధర లీటర్‌కు రూ.34.20 నుంచి రూ.43.69కు పెంచారు. ఫ్యాట్‌ శాతాన్ని బట్టి లీ­టర్‌ గేదెపాలకు రూ.103, లీటర్‌ ఆవుపాలకు రూ.­54కు పైగా పాడి రైతులకు ధర లభిస్తోంది. 10 రో­జు­లకు నేరుగా వారి ఖాతాలకు చెల్లింపులు చేస్తు­న్నాం.

ఇప్పటి వరకు జేవీపీ కింద 9.98 కోట్ల లీటర్ల పాలు సేకరించగా రూ.446.93 కోట్లు చెల్లించాం. ప్రైవేటు డెయిరీలు అమూల్‌తో పోటీపడి పాలసేకరణ ధరలు పెంచాల్సి రావడంతో పాడి రైతులు రూ.4,283 కోట్లకు పైగా ప్రయోజనం పొందారు. క్రమం తప్పకుండా 180 రోజుల పాటు పాలుపోసే రైతులకు బోనస్, సొసైటీలకు ఇన్సెంటివ్‌ ఇస్తున్నాం. వర్కింగ్‌ క్యాపిటల్‌గా రూ.30 వేల వరకు ఆర్థిక చేయూత ఇవ్వడమే కాకుండా పాడి గేదెల కొనుగోలుకు రూ.90 వేలకు పైగా రుణాలు ఇప్పిస్తున్నాం.  

ఏపీ ఆదర్శం : అల్కా ఉపాధ్యాయ, కేంద్ర పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి  
జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా మహిళా పాడి రైతులకు గిట్టు బాటు ధర కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో మెజార్టీ రాష్ట్రాల్లో పాడి రైతులకు చాలా తక్కువ ధరలు చెల్లిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో గిట్టుబాటు ధర లభించక రైతులు ఇబ్బందిపడుతున్నారు.

ఏపీలో జేపీవీ ప్రాజెక్టు ద్వారా పాడి రైతులకు గరిష్టంగా లీటర్‌ గేదె పాలపై రూ.100 అంతకంటే ఎక్కువ ధర లభిస్తుండడం ప్రశంసనీయం. దేశంలో పాడి ఆధారిత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించి జేవీపీ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించాలి. ఏపీని రోల్‌ మోడల్‌గా తీసుకుని తమ రాష్ట్రాల్లో పాడి రైతులకు గిట్టుబాటు కల్పించాలి. 

మరిన్ని వార్తలు