అక్కడంతా ఆ నలుగురే

28 Jul, 2022 12:37 IST|Sakshi

వారిని కాదని రిజిస్ట్రేషన్లు జరగవు 

రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రైవేట్‌ పెత్తనం

ముడుపులు ముట్టజెప్పని వారికి కొర్రీలు

ఇప్పటికే మంత్రి ధర్మానకు, రిజిస్ట్రేషన్‌ శాఖ డీఐజీకి ఫిర్యాదులు

తాడేల రామకృష్ణ. రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో డాక్యుమెంట్లు వెరిఫికేషన్‌ చేస్తున్నాడు. ఈయన సంబంధిత కార్యాలయ ఉద్యోగి అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఆయన లావేరు మండలం బొంతుపేటకు చెందిన ప్రైవేటు వ్యక్తి. కానీ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆయన హడావుడి చూస్తే అంతా ఇంతా కాదు. ఆర్థిక వ్యవహారాలన్నీ తానే చూసుకుంటున్నాడు. 

దన్నాన మహేష్‌. జేఆర్‌పురం గ్రామానికి చెందిన ప్రైవేటు వ్యక్తి. ఈయన కూడా రణస్థలం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే ఉంటారు. అక్కడ వ్యవహారాలన్నీ చక్కబెడతారు. ఈయనొక మధ్యవర్తి. ఈయన్ను కలిస్తే రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు ఎంచక్కా జరిగిపోతాయన్న ఆరోపణలు ఉన్నాయి. 

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ఈ ఇద్దరే కాదు మరో ఇద్దరు ఇదే రకంగా పనిచేస్తున్నారు. రిజిస్ట్రార్‌ కార్యాలయంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేదు. కేవలం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికే ప్రవేశం ఉంది. ప్రైవేటు వ్యక్తులు పెత్తనం ఉండకూడదని సీసీ కెమెరాలతో నిఘా కూడా పెట్టారు. కానీ ఇక్కడవేమి పట్టించుకోలేదు. బయట వ్యక్తుల హవాయే ఎక్కువగా ఉంది. వీరిని సంప్రదిస్తేనే రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు వేగవంతంగా జరుగుతాయి. లేదంటే కొర్రీలతో ఇబ్బందులు తప్పవు. ఇదంతా అధికారుల ప్రోత్సాహంతోనే జరుగుతోంది. వారి పేరు చెప్పుకుని ప్రతి డాక్యుమెంట్‌కు రూ.వేలల్లో వసూలు చేస్తున్నారు. అధికారులకు ఇవ్వాలని చెబుతూ భూములు, ఇతర ఆస్తుల క్రయవిక్రయాలు చేసుకునే వారి వద్ద నుంచి వసూళ్ల పర్వం సాగిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా ఉండటంతో కార్యాలయ వేళలు ముగిశాక వసూలు చేసిన సొమ్మును ముట్టజెబుతారు. ఇదంతా బహిరంగ రహస్యమే.  

 అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు.. 
మధ్యవర్తుల ప్రమేయం ఎక్కువవడంతో వీరికి ఇష్టం లేని వ్యక్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు చేయడంలో తాత్సారం జరుగుతున్నందున కొందరు బయటికొస్తున్నారు. వారు చెప్పినట్టు నడుచుకోవడం లేదని తమ డాక్యుమెంట్లకు రకరకాల కొర్రీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకుండా పక్కన పెడుతున్నారని వాపోతున్నారు. తాజాగా ఇదే విషయమై ఓ వ్యక్తి ఏకంగా రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. రణస్థలం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో అవినీతికి పాల్పడుతున్నారని, రిజిస్ట్రేషన్‌కు అవసరమయ్యే పత్రాలు సక్రమంగా ఉంటున్నా కొర్రీలు పెడుతున్నారని, అధిక మొత్తంలో సొమ్ము చెల్లిస్తేనే పని చేస్తున్నారని జేఆర్‌పురం గ్రామ పంచాయతీ గరికిపాలెం గ్రామానికి చెందిన జల్లేపల్లి సూర్యప్రకాశరావు ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో ఆ శాఖ డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఎవరెవరు అవినీతికి పాల్పడుతున్నారు? ఎంత వసూలు చేస్తున్నారు? ఎవరి పాత్ర ఎంత? తదితర వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. సక్రమంగా ఉన్న వాటికి కొర్రీలు పెట్టి, అడ్డగోలుగా ఉన్నవి ముఖ్యంగా ఫోర్జరీ సంతకాలతో ఉన్న డాక్యుమెంట్లను ముడుపులు తీసుకుని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు. ఏ డాక్యుమెంట్‌ విషయంలో ఇలా జరిగిందో.. వాటి వివరాలను కూడా ప్రస్తావించారు. మధ్యవర్తులు, కార్యాలయ బాధ్యులు కొందరు కుమ్మక్కై ఈ దందా చేస్తున్నారని స్పష్టంగా వివరించారు. ఆ ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తులే నిత్యం సబ్‌ రిజిస్టార్‌ కార్యాలయంలో ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.   

 అనుమతించడం లేదు 
గత పది రోజుల నుంచి బయట వ్యక్తులను అనుమతించడం లేదు. బయటేదో జరిగితే నాకు సంబంధం లేదు. ఎవరికి వారు ఊహించుకుంటున్నారు. సీసీ కెమెరాలు ఉన్నాయి. మాట్లాడటానికి కుదరదు.  
– కె.వేణు, సబ్‌ రిజిస్ట్రార్, రణస్థలం   

 దృష్టి పెడతా..  
నేనొచ్చాక ఫిర్యాదు రాలేదు. అంతకుముందు వచ్చిందో లేదో తెలియదు. పరిశీలిస్తాను. ఏదేమైనప్పటికీ అక్కడేం జరుగుతుందో దృష్టి పెడతాను. అడ్డగోలు కార్యకలాపాలు జరిగితే చర్యలు తీసుకుంటాం.  
– కిల్లి మన్మధరావు, జిల్లా రిజిస్ట్రార్‌    
 

మరిన్ని వార్తలు