నయా టమాటా

28 Aug, 2023 05:33 IST|Sakshi

అందుబాటులోకి యూఎస్‌–6242, అన్సోల్, జువేల్‌ రకాలు

రైతుకు గిట్టుబాటు ధర కల్పనే లక్ష్యం

హైబ్రీడ్‌ రకాల సాగుకు ప్రోత్సాహం

ఎకరాకు 40 టన్నుల దిగుబడి

సాధారణ రకాల కంటే రెట్టింపు ధర

రబీలో ఫలించిన పైలట్‌ ప్రాజెక్ట్‌

రబీలో మరింత ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ నిర్ణయం

సాక్షి, అమరావతి: కొత్త రకం టమాటా వంగడాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. యూఎస్‌–6242, అన్సోల్, జువేల్‌ వంటి హైబ్రీడ్‌ రకాలను రబీలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద సాగు చేయగా.. సూపర్‌ సక్సెస్‌ కావడంతోపాటు రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. దీంతో నూతన వంగడాల సాగును ప్రోత్సహించేందుకు ఉద్యాన శాఖ సన్నాహాలు చేస్తోంది.

ఏడాది పొడవునా టమాటాలు పండుతున్నా.. మార్కెట్‌ ధరల్లో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటున్నాయి. కొన్ని రోజులు రైతులకు లాభాలు వస్తుండగా.. కొన్ని రోజులు కనీసం పెట్టుబడి కూడా దక్కడం గగనంగా మారుతోంది. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ.. స్థానిక వెరైటీలకు ప్రత్యామ్నాయంగా యూఎస్‌–6242, అన్సోల్, జువేల్‌ వంటి హైబ్రీడ్‌ రకాలను ఉద్యాన శాఖ అందు బాటులోకి తెచ్చింది.

గుజ్జు ఎక్కువ.. ధర మక్కువ
లోకల్‌ వెరైటీ టమాటా రకాల్లో గుజ్జు శాతం ఎక్కువ లేకపోవడం వల్ల ప్రాసెసింగ్‌కు పూర్తిస్థాయిలో పనికిరావడం లేదు. విధిలేని పరిస్థితుల్లో రైతుల నుంచి తక్కువ ధరకు ప్రాసెసింగ్‌ కంపెనీలు వీటిని కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ గుజ్జు శాతం అధికంగా ఉండి ప్రాసెసింగ్‌తోపాటు స్థానికంగా వినియోగించుకునేందుకు వీలుగా ఉండే ఈ హైబ్రీడ్‌ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది.

ఒకవేళ మార్కెట్‌లో కనీస ధర లేకపోయినప్పటికీ కిలోకు రూ.6 తక్కువ కాకుండా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా సేకరించి ప్రాసెసింగ్‌ కంపెనీలకు విక్రయించేలా అవగాహన ఒప్పందం కూడా చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది వేసవిలో చిత్తూరు జిల్లా పలమనేరు, వి.కోట మండలాల్లో 136 మంది రైతులను గుర్తించి వారి ద్వారా 250 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా హైబ్రీడ్‌ రకాలను సాగు చేశారు. సాగును ప్రోత్సహించేందుకు వివిధ రూపాల్లో హెక్టార్‌కు రూ.68,225 సబ్సిడీ ఇచ్చారు.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోకల్‌ వెరైటీలైన సాహో, సాహితీ రకాలకు ఆశించిన స్థాయిలో పూత రాలేదు. వచ్చిన పూత, పిందె రాలిపోవడంతో ఎకరాకు 15–20 టన్నుల వరకు దిగుబడి వచ్చింది. ఇదే సమయంలో హైబ్రీడ్‌ టమాటాలు 35–40 టన్నుల వరకు దిగుబడులొచ్చాయి.

వైరస్‌ను తట్టుకుని తీవ్రమైన ఉష్ణోగ్రతల సమయంలో కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులొచ్చాయి. మరోవైపు లోకల్‌ వెరైటీ టమాటాలు 15 కేజీల బాక్స్‌ రూ.70–రూ.80 ధర లభించగా.. హైబ్రీడ్‌ వెరైటీలకు రూ.190–రూ.200 వరకు ధర పలికింది. హైబ్రీడ్‌ రకాలకు రెట్టింపు ధరలు రావడంతో రైతులు మంచి లాభాలను ఆర్జించారు. దీంతో రానున్న రబీలోనూ ఈ రకాలను ప్రోత్సహించాలని ఉద్యాన శాఖ సంకల్పించింది.

హైబ్రీడ్‌ రకాలకు ఊతం
సంప్రదాయ నాటు వెరైటీల­కు ప్రత్యా­మ్నాయంగా హైబ్రీడ్‌ వెరైటీలను అందుబా­టులోకి తీసుకొచ్చాం. రబీలో పైలట్‌ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ కావడంతో రానున్న రబీలో కూడా హైబ్రీడ్‌ రకాల సాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం. ధర లేకపోతే ప్రాసెసింగ్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం.– డి.మధుసూదనరెడ్డి, డీహెచ్‌ఓ, చిత్తూరు జిల్లా
 

మరిన్ని వార్తలు