‘చీరమీను’ రుచి అదిరేను.. ఏడాదిలో మూడు వారాలే లభ్యం

20 Oct, 2022 08:58 IST|Sakshi

చిట్టిచేప.. గోదావరి ప్రత్యేకం

సైజు అంగుళం.. బిందె రూ.30 వేల పైమాటే.. 

పులస తర్వాత స్థానం దీనిదే.. 

విశాఖ, హైదరాబాద్‌తో పాటు ఫ్రాన్స్‌కు రవాణా 

ఏడాదిలో మూడు వారాలే లభ్యం

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో లభించే అరుదైన చేప జాతి చీరమీను. రొయ్య పిల్లలను పోలి ఉన్నా అది చేప జాతి. గోదావరికి ప్రత్యేకం. పులస తర్వాత స్థానం దీనిదే. ఏడాదిలో సీజనల్‌గా మూడు వారాలు మించి దొరకదు. అంగుళమే ఉన్నా రుచిలో అదరగొడుతుంది. ధరలో బంగారంతో పోటీపడుతుంది. చీరమీను అక్టోబర్లోనే గోదావరి ఒడ్డున దొరుకుతుంది. దసరా నుంచి దీపావళి మధ్య లభించే చీరమ మహా అయితే నాగులచవితి వరకూ మాత్రమే లభిస్తుంది. మత్స్యకారులు గోదావరి ఒడ్డున చీరలతో పట్టుకుంటారు. అందుకే ఈ చేపను గోదారోళ్లు చీరమీనుగా పిలుస్తారు. 

సముద్రనీరు, గోదావరి కలిసే చోట.. 
శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండో స్క్వామిస్‌ జాతులకు చెందిన పిల్ల చేపల్నే చీరమీను అంటారు. సముద్రనీరు, గోదావరి కలిసే బురదనీటి మడుగుల్లో ఎక్కువగా లభిస్తాయి. మడ అడవులు ఎక్కువగా పెరిగే ప్రాంతాల్లోని నీళ్లలో ఆక్సిజన్‌ శాతం అధికంగా ఉండటంతో ఆ జాతి చేపలు ఆ ప్రాంతానికి వెళ్లి గుడ్లు పెడతాయి. గుడ్లు పిల్లలుగా మారి ఒకేసారి సమూహంగా గోదావరి ఒడ్డున ఈదుతుంటాయి. ఇవి పాండిచ్చేరి కేంద్రపాలిత యానాం, కోనసీమలోని భైరవపాలెం, ఎదుర్లంక, గుత్తెనదీవి, జి.వేమవరం, జి.మూలపొలం, అంతర్వేది ప్రాంతాల్లో లభిస్తాయి. 

గౌతమీ గోదావరి యానాం వద్ద బంగాళాఖాతంలో భైరవపాలెం సమీపంలో కలుస్తుంటుంది. ఈ ప్రాంతంలో చీరమీను ఎక్కువగా లభిస్తుంది. పులస మాదిరిగానే రూ.వేలకు వేలు పెట్టినా సీజన్‌లో చీరమీను తినాల్సిందేనంటారు. అరుదుగా దొరికే ఈ చీరమీనును ఇటీవల బకెట్లు, బిందెల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌తో పాటు ఫ్రాన్స్‌ దేశానికి కూడా పంపిస్తున్నారు. వీటిని తవ్వ, సేరు, కుంచం, బిందెలతో కొలిచి అమ్ముతున్నారు. ప్రస్తుతం సేరు(కిలో) చీరమీను రూ.1500 నుంచి రూ.2000 పలుకుతోంది. బిందె రూ.30వేలు పైమాటే. చింతచిగురు–చీరమీను, చీరమీను–మామిడికాయ, చీరమీను–గోంగూర ఇలా కలగలుపు వంటల్లో వినియోగిస్తారు.   

గోదావరికే ప్రత్యేకం..       
సముద్రం వైపు నుంచి వీచే తూర్పు గాలులకు నది ఒడ్డున చీరమీను లభ్యమవుతుంది. ఇది గోదావరిలో మాత్రమే యానాం పరిసర ప్రాంతాల్లో అరుదుగా లభిస్తుంది. వీటిని ఆకాశంలో ఎగిరే పక్షులు చూసి తింటుంటాయి. చీరల్లో మాత్రమే లభిస్తాయి. శాస్త్రీయంగా సారిడా గ్రాసిలిస్, టంబిల్, ఆండో స్క్వామిస్‌ జాతులకు చెందిన పిల్ల చేపలే  ఇవి.
–డాక్టర్‌ చంద్రశేఖర్, బయోలజీ హెడ్, ఎస్‌ఆర్‌కె డిగ్రీ కళాశాల, యానాం  

మరిన్ని వార్తలు