‘రిజిస్ట్రేషన్ ’ వికేంద్రీకరణ వైఎస్‌ జగన్‌ ఘనతే

3 Sep, 2023 05:13 IST|Sakshi

తిరుపతి జిల్లా రిజిస్ట్రార్‌ శ్రీరామ్‌కుమార్‌  

మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): రాష్ట్ర చరిత్రలో రిజిస్ట్రేషన్‌ శాఖ సేవలను గ్రామ స్థాయి వరకు వికేంద్రీకరించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని తిరుపతి జిల్లా రిజిస్ట్రార్ జి.శ్రీరామ్‌కుమార్‌ చెప్పారు. సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్‌ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ విధానంలో ‘రిజిస్ట్రేషన్‌–విధి విధానాలు’ అనే అంశంపై అవగాహన సదస్సు శనివారం జరిగింది.

శ్రీరామ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది కొనుగోలు, అమ్మకం దారుల ఇష్టం మేరకు గ్రామ సచివాలయాలు లేదా సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ చేయించుకోవచ్చునని శ్రీరామ్‌కుమార్‌ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఆధునీకరించడంలో భాగంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు చేసే విధానంలో 2.ఓ సాంకేతిక టెక్నాలజీని ప్రవేశ పెట్టిందన్నారు. ఇది నూటికి నూరు శాతం ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేదిగా ఉంటుందని చెప్పారు.

ఈ నెల 15 తేదీ నుంచి అమలయ్యే ఈ పద్ధతిలో రిజిస్ట్రేషన్లకు ఇక పై ఈ–స్టాంప్‌ విధానాన్ని అమలు చేయనున్నామని, ఈ విధానం వల్ల ముందు తేదీలతో రిజిస్ట్రేషన్లు జరిగినట్లుగా వివాదాస్పద డాక్యుమెంట్లు సృష్టించడం సాధ్యం కాదని చెప్పారు. మీడియా అకాడమీ చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. జర్నలిజం డిప్లొమో కోర్సు డైరెక్టర్‌ ఎల్‌వీకే.రెడ్డి, వర్కింగ్‌ జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు