పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం

21 Dec, 2023 04:32 IST|Sakshi

‘రామేశ్వరం కాకులు’ కథా సంపుటికి ప్రకటన

న్యూఢిల్లీలో 24 భాషలలో అవార్డులు ప్రకటించిన అకాడమీ

కథ, నవల, పర్యావరణ రంగాల్లో పతంజలి శాస్త్రి విశిష్ట కృషి

సాక్షి, హైదరాబాద్‌/పిఠాపురం: సుప్రసిద్ధ తెలుగు రచయిత తల్లావఝల పతంజలి శాస్త్రికి 2023 సంవత్సరానికిగాను సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఆయన రాసిన ‘రామేశ్వరం కాకులు’ కథా సంపుటికి ఈ పురస్కారం ప్రకటించారు. బేతవోలు రామబ్రహ్మం, పాపినేని శివశంకర్, దార్ల వెంకటేశ్వ­రరావు జ్యూరీగా వ్యవహరించారు. బుధ­వారం న్యూఢిల్లీలో జరిగిన పత్రికా సమావేశంలో 24 భారతీయ భాషల పురస్కార గ్రహీత­లను ప్రకటించారు. ఈసారి కేవలం 5 భాషల్లో కథా సంపు­టాలు అవార్డులు గెలుచుకోగా వాటిలో ఒకటి తెలు­గు సంపుటి కావడం గమనార్హం. ఎక్కువ భాషల్లో కవిత్వానికే అకాడమీ పురస్కారం మొగ్గు చూపింది.

పిఠాపురంలో జననం.. 
రాజమహేంద్రవరంలో చిరకాలంగా జీవనం 1945 మే 14న పిఠాపురంలో జన్మించిన తల్లావ­ఝల పతంజలి శాస్త్రి బాల్యం, కాలేజీ జీవితం అంతా ఒంగోలులోనే గడిచింది. తల్లి మహాలక్ష్మి, తండ్రి కృత్తివాస తీర్థులు. పతంజలి శాస్త్రి ఇరువైపుల తాతగార్లు తల్లావఝల శివశంకర శాస్త్రి, మొక్కపాటి నరసింహశాస్త్రి సాహిత్య రంగంలో లబ్ధ ప్రతిష్ఠులు. ఎస్‌.వి.యూనివర్సిటీలో ఎం.ఏ చేసిన పతంజలి శాస్త్రి పూణె నుంచి ఆర్కియా­లజీలో పీహెచ్‌డీ చేశారు.

అమలాపురం కాలేజీలో హిస్టరీ లెక్చరర్‌గా పని చేసి.. ఆ తర్వాత ‘ఎన్విరాన్‌మెంట్‌ సెంటర్‌’స్థాపించి పర్యావరణ రంగంలో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవుల రక్షణ కోసం చాలా పోరాడారు. అమెరికా, ఇజ్రాయిల్‌ దేశాలలో పర్యావరణ కార్యకర్తగా సదస్సులకు హాజరయ్యారు. దక్షిణ భారతదేశ చరిత్ర మీద, దేవాలయాల వాస్తు మీద పతంజలి శాస్త్రికి విశేష పరిజ్ఞానం ఉంది. భార్య విజయలక్ష్మితో రాజమండ్రిలో చిరకాలంగా జీవనం గడుపుతున్నారు. కుమారుడు శశి, కుమార్తె గాయత్రి.

అర్ధ శతాబ్దానికి పైగా కథారచయితగా.. ప్రత్యేక కథాశైలితో ప్రతిష్ట
1960ల నుంచి కథలు రాస్తున్న పతంజలి శాస్త్రిది తెలుగులో ప్రత్యేక శైలి. తేటతెల్లంగా కథావస్తువును బయల్పరచకుండా పాఠకుడి మేధ కొద్దీ అర్థం చేసుకునే విషయాలను ఇమడ్చుతారు ఆయన. నిర్దిష్టమైన సాంస్కృతిక నేపథ్యంతో కాకుండా సార్వజనీనమైన మానవ ప్రవర్తనలతో కథను చెప్పడం ఆయన ధోరణిలో కనిపిస్తుంది. జేబు దొంగలు, హోటల్‌ క్లీనర్లు, ఐటీ ఉద్యోగాల కట్టు బానిసలు, రంగు రాళ్ల వెతుకులాటలో ప్రాణాలు కోల్పోయే వాళ్లు, వేశ్యలు, గారడీల వాళ్లు పాత్రలుగా ఆయన కథల్లో కనిపిస్తారు.

‘వడ్ల చిలుకలు’, ‘పతంజలి శాస్త్రి కథలు’, ‘నలుపెరుపు’, ‘రామేశ్వరం కాకులు’ పతంజలి శాస్త్రి కథాసంపుటాలు కాగా ‘హోరు’, ‘దేవర కోటేశు’, ‘గేద మీద పిట్ట’నవలలు. వీటిలో ‘గేద మీద పిట్ట’ముఖ్య వస్తువు ‘మగ వేశ్యలు’కావడం ఒక ప్రత్యేకత. ‘మాధవి’అనే నాటకం రాశారు. గాథాసప్తశతిలోని వంద కథల్ని తెలుగులోకి అనువదించారు. ‘నేను నడుస్తున్నా, బస్సులో ఉన్నా, ఏం చేస్తున్నా మనసులో ఏదో కథ రాస్తూనే ఉంటాను’అని చెప్పే పతంజలి శాస్త్రి అలుపెరగక రాస్తూనే ఉన్నారు. పతంజలి శాస్త్రికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడం పట్ల పలువులు సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

సాహిత్యం నా జీవితం
నా సాహిత్య వ్యాసంగం గుర్తింపు కోసమో, పురస్కారాల కోసమో కాదు. పర్యావరణం, సాహిత్యం నా జీవితం.. నా రచన. ‘రామేశ్వరం కాకులు’ దేశంలోనే గౌరవప్రదమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోవడం సంతోషం. అధ్యయనం, అనుశీలనం నా ధ్యేయాలు.. ఇంకా రాస్తూనే ఉంటాను.
-తల్లావఝల పతంజలి శాస్త్రి, రాజమహేంద్రవరం

>
మరిన్ని వార్తలు