నామినేషన్‌పై అడ్డగోలు లూటీ! 

20 Nov, 2023 05:44 IST|Sakshi

ప్రజాధనాన్ని కొల్లగొట్టిన రామోజీ–యనమల బంధుగణం 

ఓ నిర్మాణ కంపెనీకి అంతులేని మేలు అంటూ ఈనాడు దుష్ప్రచారం

గత సర్కారు హయాంలో పట్టిసీమ పనులు చేసింది అదే సంస్థ కాదా?

ట్రాన్స్‌ట్రాయ్‌కి నాడు రూ.1,333 కోట్లు బాబు సంతర్పణ

రివర్స్‌ టెండర్లతో రూ.660 కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేసిన సీఎం జగన్‌

పోలవరం పనుల్లో జాప్యం లేకుండా సీజన్‌లో వడివడిగా కొనసాగించేలా చర్యలు

సాక్షి, అమరావతి: అటు పేదలకు పథకాలు అందకూడదు.. ఇటు ప్రాజెక్టుల పనులు ముందుకు సాగకూడదు!! ఇదీ ఈనాడు దుర్బుద్ధి! ఇదే లక్ష్యంగా అస్మదీయులకు అడ్డగోలుగా.. అంటూ ఓ బురద కథనాన్ని పాఠకులపైకి వదిలింది. ఓ నిర్మాణ కంపెనీకి ప్రభుత్వం అంతులేని మేలు చేస్తోందంటూ రామోజీ అక్కసు వెళ్లగక్కారు.

గత సర్కారు హయాంలోనూ ఇదే కంపెనీ కాంట్రాక్టు పనులు చేసిన విషయం ఆయనకు గుర్తులేదా? రామోజీ, యనమల బంధుగణం నవయుగ, పుట్టా సుధాకర్‌ యాదవ్‌ నామినేషన్‌పై పనులను దక్కించుకుని అంచనాలు పెంచేసి బిల్లులు కాజేయడం నిజం కాదా? నాటి సీఎం చంద్రబాబు అండతో ప్రజాధనాన్ని కొల్లగొట్టడం రామోజీకి తప్పుగా తోచలేదా? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ పనులు చేపట్టినా వ్యతిరేకించడం దివాళాకోరుతనం కాదా?  అయినా ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అందుకు అనుగుణంగా పనులు చేపడతాయి. అది కూడా తప్పుబట్టే వారిని ఏమనుకోవాలి? 

ఈనాడు ఆరోపణ: బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ గ్యారెంటీలా? 
వాస్తవం: మీడియా ముసుగులో బురద చల్లుతున్న ఇదే రామోజీ గతంలో మధ్యవర్తిత్వం నడిపి పట్టిసీమ, పురుషోత్త పట్నం లాంటి పథకాలను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా + 22 శాతంతో అధిక రేట్లకు కట్టబెట్టారు. అప్పుడు ఇదే గుత్తేదారు చంద్రబాబుకు అస్మదీయుడని ఆయనకు ఎందుకు అనిపించలేదు?

పోలవరంలో రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌ట్రాయ్‌కి నిబంధనలకు విరుద్ధంగా రూ.1,333 కోట్ల ప్రజాధనాన్ని అప్పనంగా దోచి పెట్టినప్పుడు రామోజీకి ఫైనాన్స్‌ కోడ్‌ గుర్తు రాలేదా? వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అదే పనిని రివర్స్‌ టెండర్ల ద్వారా 12.60 శాతం తక్కువ వ్యయంతో మేఘా సంస్థకు పారదర్శకంగా కేటాయించి రూ.660 కోట్లను ఆదా చేసింది. 22 శాతం అదనంతో రూ.257.39 కోట్లను చంద్రబాబు లూటీ చేస్తే అది తప్పుకాదా రామోజీ? 

ఈనాడు ఆరోపణ: అస్మదీయుల బిల్లుల చెల్లింపులకు అడ్డగోలుగా గ్యారెంటీలు
వాస్తవం: గత ప్రభుత్వంలోనూ ఇదే కాంట్రాక్టు సంస్థ పట్టిసీమ సహా వివిధ ప్రాజెక్టుల్లో పనులు చేసింది. మరి రామోజీకి అప్పుడు అంతా సవ్యంగానే కనిపించింది కదా?

మేఘా ప్రతిపాదనలకు అధికారులు సై..
వాస్తవం: మేఘా కంపెనీ పోలవరంతోపాటు కీలకమైన వెలిగొండ టన్నెల్‌ పనులు చేస్తోంది. పోలవరం కోసం రాష్ట్ర ఖజానా నుంచి వెచ్చించిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్‌ చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖజానా నుంచి రూ.1,319 కోట్లు పోలవరం పనులకు వ్యయం చేసింది. మేఘా దాదాపు రూ.1,200 కోట్ల మేర పనులు చేసింది. పోలవరం పనులు పునఃప్రారంభించే సీజన్‌ ఆరంభం కావడంతో డబ్బులు రీయింబర్స్‌ చేయాలని రాష్ట్రం ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభించేలోగా పనులను వడివడిగా చేపట్టి కొలిక్కి తేవాల్సిన ఆవశ్యకత నెలకొంది. ఈ నేపథ్యంలో మేఘా నిధుల కోసం బ్యాంకుల నుంచి లోన్‌ తీసుకునేందుకు ఆర్థిక శాఖ అనుమతి కోరింది. ఖజానాకు ఎలాంటి నష్టం వాటిల్ల­కుండా షరతులతో ప్రభుత్వం ఈ ప్రతి­పాదనను పరిశీలిస్తోంది. బ్యాంకు విధించే వడ్డీ తదితర రుసుములను పూర్తిగా మేఘానే భరించాల్సి ఉంటుంది. న్యాయపరమైన అన్ని అంశాలకు సైతం కంపెనీనే బాధ్యత వహించాలి. ఇటువంటి కఠిన షరతుల మధ్య మేఘా ప్రతిపాదన పరిశీలనలో ఉంది. 

మరిన్ని వార్తలు