పగటి పూటా ఓ కునుకేయండి

20 Nov, 2023 05:44 IST|Sakshi

మధ్యాహ్నం వేళ 15 నుంచి 30 నిమిషాల నిద్రతో ఆరోగ్యానికి ఎంతో మేలు 

వృద్ధాప్య ఛాయలు ఏడేళ్ల వరకు తగ్గింపు 

లండన్‌ వర్సిటీ, ఉరుగ్వే వర్సిటీ పరిశోధనల్లో వెల్లడి 

నిద్ర లేమితో అల్జీమర్స్, చిత్త వైకల్యం వచ్చే ప్రమాదం 

అధిక నిద్రతోనూ అనారోగ్య సమస్యలు 

సాక్షి, అమరావతి: చక్కటి నిద్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. అందులోనూ పగటిపూట తీసే చిన్నపాటి కునుకు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ మధ్యాహ్నం 15–30 నిమిషాలు రెప్పవాల్చితే చిత్తవైకల్య ప్రమాదం తగ్గడంతో పాటు వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరవని తాజా అధ్యయనంలో వెల్లడైంది. సాధారణ వ్యక్తులతో పోలిస్తే పగటిపూట నిద్రించే వారిలో 2.6–7 సంవత్సరాల వరకు వృద్ధాప్యం నెమ్మదిస్తుంది.

యూనివర్సిటీ కాలేజ్‌ లండన్, ఉరుగ్వేలోని యూనివర్సిటీ ఆఫ్‌ రిపబ్లిక్‌ పరిశోధకులు క్రమం తప్పకుండా పగటిపూట నిద్రపోవడం వల్ల మెదడు కుచించుకుపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందని.. చురుకుదనాన్ని ప్రేరేపిస్తుందని తేల్చారు. ఫలితంగా జ్ఞాన సామర్థ్యం, జ్ఞాపక శక్తి పెరుగుతాయని గుర్తించారు. అయితే.. పగటిపూట 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. 

సంపూర్ణ ఆరోగ్యానికి 7 గంటల నిద్ర 
సంపూర్ణ ఆరోగ్యానికి సుమారు 7 గంటల మంచి నిద్రను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రతిపాదిస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా భారత్‌లోని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రపంచంలో నిద్ర లేమితో బాధపడుతున్న దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

నిద్ర లేకపోవడం వల్ల కలిగే సమస్య కేవలం అలసట ఒక్కటే కాదని.. తీవ్ర దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట కలతలేని నిద్రతో అలసట, తలనొప్పి, మూడ్‌ స్వింగ్స్‌ నియంత్రణలో ఉండి మానసిక ఉత్సాహంతో పని చేస్తారని చెబుతున్నారు. అయితే.. తక్కువ నిద్రపోయే వారిలో అల్జీమర్స్‌ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువని అధ్యయనం వెల్లడించింది.  

అతి నిద్ర ప్రమాదకరం 
తక్కువ నిద్రతోనే కాదు.. అతి నిద్రతోనూ ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజంతా అదే పనిగా నిద్రపోతే అధిక రక్తపోటు, స్ట్రోక్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తేల్చారు. అతి నిద్ర అంతర్లీన నిద్ర రుగ్మతకు సంకేతమని భావిస్తున్నారు. ఈ రుగ్మతతో ఒత్తిడి, బరువును నియంత్రించే హార్మోన్లపై ప్రభావం చూపుతుందని తేల్చారు. ఫలితంగా చిన్న వయసులోనే ఊబకాయం, బీపీ, టైప్‌–2 డయాబెటిస్, గుండె జబ్బులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   

స్క్రీనింగ్‌ సమయంతోనే ముప్పు 
స్క్రీనింగ్‌ సమయం నిద్రలేమి స్థాయిని పెంచుతుందని అధ్యయనం చెబుతోంది. నిద్రలేమితో బాధపడే వారిలో దాదాపు 54 మంది డిజిటల్, సోషల్‌ మీడియాను విరివిగా వినియోగిస్తున్నట్టు గుర్తించింది. దాదాపు 87 శాతం మంది భారతీయులు పడుకునే ముందు తమ ఫోన్లను ఉపయోగిస్తుండటంతో తీవ్రమైన నిద్ర సమస్యకు దారితీస్తుందని పేర్కొంది.

ఫలితంగా 56 శాతం మంది పురుషులతో పోలిస్తే 67 శాతం మంది మహిళలు పని సమయంలో నిద్రపోతున్నారని వెల్లడించింది. వీలైనంత వరకు మధ్యాహ్నం 2 గంటలలోపు కెఫిన్‌ ఉండే పదార్థాలను తగ్గించాలని.. మద్యం తాగి నిద్రపోవడం/నిద్రపోయే మూడు గంటల ముందు మద్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చేటని సూచిస్తున్నారు. ముఖ్యంగా నిద్రవేళకు దగ్గర సమయంలో వ్యాయామం చేయడం కూడా నిద్రలేమికి కారణంగా భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు