బోధనాస్పత్రులపై స్పెషల్‌ ఫోకస్‌ 

23 Oct, 2023 05:22 IST|Sakshi

కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ తరహాలో నాన్‌–క్లినికల్‌ అంశాల పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ 

11 పాత బోధనాస్పత్రులకు జాయింట్‌ డైరెక్టర్‌ స్థాయి అధికారులు 

ఒక్కో ఆస్పత్రిలో ముగ్గురు ఏడీలు, మరికొందరు సిబ్బంది కూడా... 

ఇటీవల కొత్తగా 99 పోస్టులను సృష్టించిన ప్రభుత్వం 

సూపరింటెండెంట్‌పై తగ్గనున్న పనిభారం 

రోగుల సంరక్షణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టేందుకు అవకాశం  

సాక్షి, అమరావతి: ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చివేసిన ప్రభుత్వం... రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆస్పత్రుల నిర్వహణపై కూడా దృష్టి పెట్టింది. కార్పొరేట్‌ హాస్పిటల్స్‌ తరహాలో ప్రభుత్వాస్పత్రుల్లోనూ నిర్వహణ బాధ్యతలను చూసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 11 పాత బోధనాస్పత్రులకు ప్రత్యేకంగా జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) స్థాయి అధికారులను వైద్యశాఖ నియమించనుంది. వీరికి సహాయకులుగా మరో 88 మందిని నియమిస్తుంది. ఈ మేరకు కొత్తగా 99 పోస్టులను ఇటీవల సృష్టించింది.  

ఎవరి బాధ్యతలు ఏమిటంటే... 
సాధారణంగా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌లో వైద్యపరమైన (క్లినికల్‌) అంశాలను మెడికల్‌ సూపరింటెండెంట్‌ పర్యవేక్షిస్తారు. నాన్‌–క్లినికల్‌ (ఆస్పత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలు) వ్యవహారాలపర్యవేక్షణకు సీఈవో/జీఎం ఆపరేషన్స్‌/అడ్మినిస్ట్రేటర్‌ హోదాలో మరొకరు ఉంటారు. 
ఇప్పటి వరకు ప్రభుత్వాస్పత్రుల్లో క్లినికల్, నాన్‌ క్లినికల్‌ రెండింటి పర్యవేక్షణ బాధ్యత సూపరింటెండెంట్‌ చూస్తున్నారు.  
 ఇకపై ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో మెడికల్‌ సూపరింటెండెంట్‌లను వైద్యపరమైన వ్యవహారాలకు పరిమితం చేస్తారు. 
 పరిపాలన కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. జేడీ నేతృత్వంలో ముగ్గురు ఏడీలతోపాటు అసిస్టెంట్‌ ఇంజినీర్, ఫెసిలిటీ మేనేజర్, సిస్టం అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్‌ వంటి సహాయక సిబ్బంది పనిచేస్తారు. వీరు ఆస్పత్రిలో భవనాల నిర్వహణ, సెక్యూరిటీ, శానిటేషన్, డైట్, ఉద్యోగుల హాజరు, జీతభత్యాలు, ఇతర నాన్‌ క్లినికల్‌ అంశాలను చూస్తారు. 
సూపరింటెండెంట్‌లకు ఇప్పటివరకు ఉన్న ఆస్పత్రి నిర్వహణ భారం తొలగిపోయి రోగుల సంరక్షణకు ఎక్కువ సమయాన్ని కేటాయించే అవకాశం లభిస్తుంది. వైద్యుల హాజరు, ఐపీ, ఓపీ, సర్జరీ సేవలపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతారు.   

ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపే లక్ష్యంగా... 
ప్రభుత్వాస్పత్రుల్లో ప్రమాణాలు పెంచి మంచి వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలన్నదే సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యం. ఈ క్రమంలో మన ఆస్పత్రులకు నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ ఫర్‌ హాస్పిటల్స్, హెల్త్‌కేర్‌(ఎన్‌ఏబీహెచ్‌) గుర్తింపు పొందడమే లక్ష్యంగా వైద్యశాఖ అడుగులు వేస్తోంది. ఈ దశగా చేపట్టిన చర్యల ఫలితంగా ఇప్పటికే విశాఖపట్నంలోని ఛాతీ, మెంటల్‌ కేర్‌ ఆస్పత్రులకు ఎన్‌ఏబీహెచ్‌ గుర్తింపు లభించింది.

మరోవైపు రాష్ట్రంలోని అత్యధిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ స్టాండర్డ్స్‌ (ఎన్‌–క్వా‹Ù) గుర్తింపు పొందాయి. ఎన్‌–క్వాష్‌ గుర్తింపులో దేశంలోనే మన రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. ఇదే తరహాలో మిగిలిన ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించడానికి నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.    

మరిన్ని వార్తలు