చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..ధరెంతో తెలుసా?

9 Nov, 2021 20:00 IST|Sakshi
చిన్నసైజులో ఉండే చీరమేను- యానాం మార్కెట్‌లో స్టీలు క్యారేజీల్లో చీరమేను

చీరమేను.. అ‘ధరే’ను!

యానాం మార్కెట్‌లో శేరు రూ.4వేలు

తూర్పుగాలులు వీస్తున్నా.. తక్కువగా దొరుకుతున్న వైనం

యానాం: పులస చేప సీజన్‌ తర్వాత వచ్చే చీరమేను రుచి చూడడం కోసం గోదావరి జిల్లాల వాసులు ఎదురుచూస్తుంటారు. శీతాకాలం ప్రారంభంలోనే దొరికే చీరమేను చేప ఎక్కువగా దసరా నుంచి నాగులచవితి వరకు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం తూర్పుగాలులు వీస్తున్నప్పటికీ మత్స్యకారులకు చీరమేను లభ్యత గగనమై పోవడంతో ధర ఆకాశాన్ని అంటుతోంది. సాధారణంగా శేరు రూ.1,500 నుంచి రూ.2,000కి దొరకుతుంది.

చదవండి: పాపికొండలకు చలోచలో

సోమవారం సాయంత్రం యానాం మార్కెట్‌లోకి వచ్చిన చీరమేను శేరు ధర రూ.4వేలు పలికింది. చిత్రంలో కన్పించే ఒక్కొక్క స్టీలు క్యారేజీలోని చీరమేను ధర రూ.4వేలు, పసుపు రంగుప్లేటులో ఉన్న చీరమేను ధర రూ.1600 పలికింది. ప్రస్తుతం గ్లాసు, సోల, కొలతల్లో అమ్ముతున్నారని అదే బిందెల్లో అమ్మకం జరిపితే రూ.లక్ష వరకు ఉంటుందని అంటున్నారు. కార్తికమాసంలో మాంసాహారాన్ని తీసుకునేవారు తక్కువగా ఉండటంతో ఈ ధర ఉంది. అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా అధిక ధర ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి చీరమేను గోదావరిలో లభ్యత తక్కువగా ఉందని, దీంతో రేటు సైతం అధికంగా ఉంటోందని వేలం పాటలో పాడుకున్న మత్స్యకార మహిళలు చెబుతున్నారు.

నది ముఖ ద్వారం వద్ద లభ్యత 
సముద్రం, నదీ కలిసే ముఖద్వారాల (సీమౌత్‌) వద్ద చీరల సహాయంతో పట్టే చీరమేను ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ విధంగా యానాం, కోటిపల్లి, మసకపల్లి తదితర ప్రాంతాల నుంచి యానాం మార్కెట్‌కు చీరమేనును తీసుకువచ్చి మార్కెట్‌లోనే వేలం పాటను నిర్వహిస్తున్నారు. వాటిని మత్స్యకార మహిళలు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని చిల్లరకు అమ్ముతున్నారు.

అనేక రకాలుగా వంటలు:
చీరమేనును మసాలా తో ఇగురుగానే కాకుండా గారెలు, చింత చిగురు, మామిడికాయ, గోంగూర ఇలా కూరల్లో నోరూరించేలా ఇక్కడి మహిళలు వండుతుంటారు.   

చమురు తవ్వకాల వల్ల దొరకడం లేదు 
గోదావరిలో ఇదివరలా చీరమేను దొరకడం లేదు. నదీముఖద్వారాల వద్ద చమురు తవ్వకాలు జరుపుతుండటంతో చీరమేను వేరే ప్రాంతాల వైపు మళ్లుతోంది. తక్కువగా వస్తుండటంతో మార్కెట్‌లో అధిక ధరలకు అమ్మాల్సి వస్తోంది. 
– నాటి పార్వతి, మత్స్యకార మహిళ

మరిన్ని వార్తలు