పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించిన సజ్జల ఆధ్వర్యంలోని బృందం

30 Jun, 2021 16:38 IST|Sakshi

సాక్షి, పోలవరం రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలోని 10 మంది సభ్యుల బృందం బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను పరిశీలించింది. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులను 2005లో దివంగత ముఖ్యమంత్రి డా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రారంభించారని, అన్ని ప్రాంతాలు సస్యశ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్‌ఆర్‌ ఈ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. అయితే, వైఎస్‌ అకాల మరణంతో ప్రాజెక్ట్‌ పనులు నిలిచిపోయాయని, తిరిగి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పనులు వేగవంతమయ్యాయని అన్నారు. 

ఉమ్మడి రాష్ట్రంలోనే పోలవరం కేంద్ర ప్రాజెక్ట్‌గా ఆమోదించబడిందని, బాబు హయాంలో పనులు వేగంగా జరిగి ఉంటే 2018లోనే ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తయ్యేదని, కమీషన్ల కోసం చంద్రబాబు కక్కుర్తి పడటంతో పోలవరం ఆలస్యమైంది వెల్లడించారు. పోలవరం నిర్మాణాన్ని సీఎం జగన్‌  తన కర్తవ్యంగా భావించారని, అందుకే కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో సైతం పనులు ఆగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కోవిడ్‌ కష్టకాలంలోనూ సీఎం జగన్‌ ప్రత్యేక పర్యవేక్షనలో తొలిసారి స్పిల్ వే నుంచి నీటిని విడుదల చేసామని, అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

కేవలం కాపర్ డ్యామ్ కట్టి చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతినిందని ప్రస్తావించారు. అలాగే పునరావాసం పనులు కూడా వాయువేగంతో ముందుకు సాగుతున్నాయని, దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకేయని ప్రతిపక్షం, ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని హెచ్చరించారు. పునరావసానికి ఒక్క ఇటుక కూడా వేయని చంద్రబాబు ఇప్పుడు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. ప్రాజెక్ట్‌ను సందర్శించిన బృందంలో ప్రభుత్వ చీఫ్ విప్‌ గడికోట శ్రీకాంత్ రెడ్డి, బూడి ముత్యాలనాయుడు, దాడిశెట్టి రాజా, సామినేని ఉదయభాను, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

>
మరిన్ని వార్తలు