జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీశ్రీ 

10 Aug, 2021 08:36 IST|Sakshi
స్వీయ దస్తూరితో శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పుస్తకావిష్కరిస్తున్న అతిథులు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

కలాన్ని గెలిచిన వారు శ్రీశ్రీ : భువన చంద్ర

స్వీయ దస్తూరితో శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం పుస్తకావిష్కరణ

తిరుపతి కల్చరల్‌ : తన రచనలతో జాతిని మేల్కొలిపిన యుగకర్త శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీశ్రీ) అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. మానవ వికాస వేదిక, రాజా చంద్ర ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో సోమవారం శ్రీశ్రీ స్వీయ దస్తూరితో రాసిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీశ్రీతో తనకున్న అనుభవాలు, జ్ఞాపకాలను పంచుకుంటూ ప్రస్థానం గీతాలను ఆలపించారు. శ్రీశ్రీ రచనలు జన హృదయాలను ప్రభావితం చేసేలా సాగాయన్నారు. చలం చెప్పినట్లు శ్రీశ్రీ కవిత్వం తెలుగు జాతిని ఊగించి, శాసించి, లాలించిందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తిరుపతితో పాటు వ్యక్తిగతంగా శ్రీశ్రీకి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. తన సోదరుడు భూమన కారణంగా శ్రీశ్రీ ప్రభావం తనపై పడిందన్నారు. ఆయనతో ఉన్న తనకున్న అనుభవాలను, మధురస్మతులను పంచుకుననారు. చిన్ననాటి నుంచి ఆయన రచనలు తనపై ఎంతో ప్రభావం చూపాయన్నారు.

‘కవి’యుగ దైవం శ్రీశ్రీ
సినీ గేయ రచయిత భువనచంద్ర మాట్లాడుతూ.. కలాన్ని జయించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీరంగం కవిత్వం చదవని వారు రచయితలే కాదని నమ్ముతున్నట్లు తెలిపారు. కలియుగ దైవం శ్రీవారు అయితే ‘కవి’యుగ దైవం శ్రీశ్రీ అని కొనియాడారు. శ్రీవారి పాదాల చెంత మొట్టమొదటి డబ్బింగ్‌ సినిమా రచనకు ఆధ్యుడు శ్రీశ్రీనే అని గుర్తు చేసుకున్నారు. ఆయన అక్షర విలువను ఎంచడం ఎవరి తరం కాదన్నారు. ఎన్ని సిరులు వెళ్లినా శ్రీశ్రీ మాత్రం మననుంచి వదలి వెళ్లలేదని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ అద్భుత కవితల ప్రవకర్త శ్రీశ్రీ అని కొనియాడారు. తెలుగు సాహిత్యాన్ని ఆకాశం నుంచి నేల మీదకు దింపారని అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కళాపోషకుడిగా తెలుగు వైభవాన్ని చాటిన ఘనుడని కొనియాడారు. తన బిడ్డకు రాజకీయ వారసత్వంతో పాటు సాంస్కతిక వారసత్వాన్ని అందించారన్నారు. కార్పొరేషన్‌ డెప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటి తరానికి, యువతరానికి శ్రీశ్రీ రచనలు ఓ చైతన్య దీపికలుగా నిలుస్తాయన్నారు. అంతటి మహనీయుడు రచించిన మహాప్రస్థానం గ్రంథావిష్కరణ తన చేతుల మీదుగా జరగడం మహద్భాగ్యమని తెలిపారు. పుస్తక ప్రచురణ కర్తకు రూ.20 వేలు బహుమతిగా అందజేశారు.

పుస్తకావిష్కరణ చేసిన అభినయ్‌ రెడ్డి 
తిరుపతి నగర డెప్యూటీ మేయర్‌ భూమన అభినయ్‌ చేతుల మీదుగా శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని రచయిత నామిని సుబ్రహ్మణ్యంనాయుడికి, రెండో ప్రతిని విశ్రాంత ప్రిన్సిపల్‌ పెద్ది సత్యనారాయణకు అందజేశారు. కార్యక్రమంలో శ్రీశ్రీ ప్రింటర్స్‌ అధినేత విశ్వేశ్వరరావు, రాజాచంద్ర ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు దుర్గాప్రసాద్, కార్పొరేషన్‌ మేయర్‌ శిరీషా, మానవ వికాస వేదిక కనీ్వనర్లు సాకం నాగరాజు, శైలకుమార్, పలువురు కవులు, రచయితలు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు