బీపీఎస్‌లో మాయాజాలం

14 Sep, 2020 10:00 IST|Sakshi

చేతివాటం ప్రదర్శిస్తున్న లైసెన్స్‌ ఇంజనీర్లు 

 నెలలుగా 460 దరఖాస్తులు పెండింగ్‌ 

ఆమ్యామ్యాల కోసం అడ్డదారులు 

సచివాలయాలకు వెళ్లకుండా ఫైళ్లు తొక్కిపెట్టిన వైనం 

నగరపాలక సంస్థ ఆదాయానికి గండి  

ప్రతి పని పారదర్శకంగా, వేగంగా చేసేందుకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ చేస్తోంది. అంతేకాకుండా స్థానికంగానే పనులు జరిగేలా సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చింది. కానీ నగరపాలక సంస్థలో మాత్రం సేవలు ఆఫ్‌లైన్‌ అయ్యాయి. అతిముఖ్యమైన నిర్మాణాల క్రమబద్ధీకరణ (బీపీఎస్‌) దరఖాస్తులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. కొందరు లైసెన్స్‌ ఇంజనీర్లు ఫైలు ఆన్‌లైన్‌ వరకూ కూడా రాకుండా చక్రం తిప్పుతున్నారు. 

సాక్షి, అనంతపురం :  నగరపాలక సంస్థకు ఆదాయం తీసుకువచ్చే వాటిలో టౌన్‌ ప్లానింగ్‌ ప్రధానమైనది. సంస్థ పరిధిలో గృహ నిర్మాణం మొదలుకొని కాంప్లెక్స్, అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణాల వరకూ టౌన్‌ప్లానింగ్‌ అనుమతులు తీసుకోవాలి. అనివార్య కారణాల వల్ల అనుమతి లేకుండా, సంస్థ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన వాటిని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం బీపీఎస్‌(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం)ను ప్రవేశపెట్టింది. దీని వల్ల అక్రమ భవనాలను క్రమబద్ధీకరించుకునేందుకు వీలుకలుగుతుంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది. ఇటీవల ప్రభుత్వం బీపీఎస్‌ మేళా కూడా నిర్వహించింది. అయినా ఎక్కువ మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారనే ఉద్దేశంతో గడువు కూడా డిసెంబర్‌ వరకూ పొడిగించింది. అయినా అనుకున్న మేర స్పందన కనిపించడం లేదు. కారణాలు ఆరా తీస్తే దీని వెనుక కొంతమంది లైసెన్స్‌ సర్వేయర్ల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం సేవలన్నీ సచివాలయాలకు అప్పగిస్తున్నారు. దీంతో కొందరు లైసెన్స్‌ సర్వేయర్లు టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధించిన ఫైళ్లను సచివాలయాలకు వెళ్లకుండా ఆన్‌లైన్‌లోనే మొకాలడ్డుతున్నారు. ఫైలు సచివాలయానికి వెళ్తే అక్కడ ఏదైనా కొర్రీలు వేస్తే తమకు అందాల్సిన అందకుండా పోతాయని తాత్సారం చేస్తున్నారు. 

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. సుదూర ప్రాంతాల్లో ఉండే కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమీపంలోనే సచివాలయాలను ఏర్పాటు చేసి వేగవంతమైన సేవలందిస్తోంది. నగరంలో 50 డివిజన్‌లుండగా దాదాపు 74 సచివాలయాలున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ద్వారా పొందే సేవలన్నీ సచివాలయాల ద్వారానే పొందవచ్చు. గృహ నిర్మాణ అనుమతులు కూడా ఇటీవల దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అందజేస్తున్నారు. అయితే తమ ఆదాయానికి ఎక్కడ గండిపడుతుందనే ఉద్దేశంతో కొంతమంది లైసెన్స్‌ ఇంజనీర్లు మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నారు. దరఖాస్తులు సచివాలయాల్లోని ప్లానింగ్‌ సెక్రటరీల వద్దకు గానీ వెళ్లకుండా ఆన్‌లైన్‌ లాగిన్‌లో అప్‌లోడ్‌ చేయడం లేదు. ఇప్పటి వరకూ ఇలా 460 దరఖాస్తుల వరకూ పెండింగ్‌లో ఉన్నాయి. వీటి ద్వారా కనీసం రూ. 5 కోట్ల వరకూ నగరపాలక సంస్థకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే భవన యజమానుదారులను ఇబ్బందులు పెట్టడం వల్ల తమ చేయి తడుస్తుందనో... లేక మరో దురుద్దేశమో తెలియదు కానీ 460 దరఖాస్తులు లైసెన్స్‌ ఇంజనీర్లు లాగిన్‌లలో పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో ఇద్దరు, ముగ్గురు ఇంజనీర్‌లవే దాదాపు 200 దరఖాస్తులు ఉండడం గమనార్హం.   

బీపీఎస్‌ ఇలా... 
*అనుమతలు లేకుండా, నిబంధనలు ఉల్లంఘించి  నిర్మించిన కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు బీపీఎస్‌ అవకాశం ఇస్తుంది. ఈ క్రమంలో  భవన యజమాని లైసెన్స్‌డ్‌ ఇంజినీర్‌ను సంప్రదించాలి. 
* లైసెన్స్‌డ్‌ ఇంజినీర్‌ ఇంటి కొలతలు, ఇతర సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. 
*దరఖాస్తు వార్డు సచివాలయానికి వెళ్తుంది. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలించి రిమాక్స్‌ రాసి పంపుతారు.  ఇది టౌన్‌ప్లానింగ్‌కు వెళితే...వారు వెళ్లి పరిశీలన చేస్తారు. 
*అన్నీ సవ్యంగా ఉంటే...ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తం చెల్లిస్తే బీపీఎస్‌ పూర్తవుతుంది. 
* కానీ ఫైలు సచివాలయానికి వెళితే పని కాదని భావిస్తున్న కొందరు లైసెన్స్‌ సర్వేయర్లు దాన్ని పెండింగ్‌లో పెట్టేస్తున్నారు.

రెండు వారాలు గడువిచ్చాం 
బీపీఎస్‌ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొన్ని షార్ట్‌ఫాల్స్‌ గుర్తించాం. సరిచేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించాం. ఇలా ఇప్పటి వరకూ 460 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. లైసెన్స్‌ ఇంజనీర్లు వారి లాగిన్‌లోనే ఉంచుకున్నారు. దీన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నాం. అందరికీ రెండు వారాలు గడువు విధిస్తూ నోటీసులు జారీ చేస్తున్నాం. ఆ తర్వాత వారి లాగిన్‌లను బ్లాక్‌ చేస్తాం. అనంతరం క్రమబద్ధీకరించుకోని భవనాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.  
– రామలింగేశ్వర రెడ్డి, ఏసీపీ, నగరపాలక సంస్థ  

అనంతపురం వేణుగోపాల్‌నగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసరావు(పేరు మార్చాం) తన భవనాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు నగరపాలక సంస్థకు దరఖాస్తు చేసుకున్నారు. బీపీఎస్‌ మంజూరు చేసేందుకు ఉన్న ఇబ్బందులను తెలియజేస్తూ (షార్ట్‌ఫాల్‌) అధికారులు నోటీసులు పంపారు. దాదాపు రెండు నెలలుగా ఈ దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. సంబంధిత లైసెన్స్‌ ఇంజనీర్‌ బీపీఎస్‌ మంజూరులో నెలకొన్న ఇబ్బందులను భవన యజమానికి తెలియపర్చకుండా నాన్చుతూ వస్తున్నారు. ఇది తెలియని భవన యజమాని మాత్రం నగరపాలక సంస్థ కార్యాలయం చుట్టూ రోజూ తిరుగుతున్నారు. అలాంటి వారు నగరంలో వందల్లో ఉన్నారు. దీనివల్ల నగరపాలక సంస్థ ఖజానాకు సకాలంలో డబ్బులు చేరక అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా