పేరుకే బండారు శ్రావణి.. అడుగడుగునా అవమానాలే..

19 Apr, 2023 10:13 IST|Sakshi

టీడీపీ బడుగుల బలహీనవర్గాల నాయకులకు గడ్డు కాలం వచ్చింది. వీరిపై అగ్రవర్ణాల వారి పెత్తనం ఎక్కువైంది. అడుగడుగునా వివక్ష, అవమానాలతో ఇబ్బంది పెడుతున్నారు.   దీంతో పార్టీ కేడర్‌ రెండు వర్గాలుగా విడిపోతోంది. పెత్తనం తారస్థాయికి చేరుతుండటంతో బడుగులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధినాయకత్వం జోక్యం చేసుకోకపోవడం గమనార్హం. 

సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీలో బడుగు, బలహీన వర్గాల నాయకులపై అణచివేత పెరిగిపోతోంది. 2019 ఎన్నికలకు ముందే ఆ పార్టీలో ఇమడలేక చాలామంది నాయకులు వైఎస్సార్‌ కాంగ్రెస్‌  పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు టీడీపీలో ఎస్సీల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు కోటరీగా చెప్పుకునే అగ్రకులాల వారే పెత్తనం చేస్తుండటంతో ఉన్న కొద్దిమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలూ ఇతర పారీ్టల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తాజాగా పదిహేను రోజులపాటు నారాలోకేష్‌ పాదయాత్ర చేసినా.. తన కళ్లముందే ఎస్సీలపై దాడులు జరుగుతున్నా.. నోరు మెదపలేదు.

 పేరుకే బండారు శ్రావణి.. 
శింగనమల నియోజకవర్గంలో బండారు శ్రావణి ఎప్పట్నుంచో టీడీపీకి సేవలందిస్తోంది. కానీ ఈమెకు అడుగడుగునా పార్టీలో అవమానాలే ఎదురవుతున్నాయి. లోకేష్‌ పాదయాత్ర సమయంలోనే శ్రావణి తండ్రిపై ఇతర సామాజికవర్గ పెద్దలు దాడి చేశారు. గార్లదిన్నె పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. అయినా లోకేష్‌ దీనిపై స్పందించలేదు. అంతేకాదు నియోజకవర్గంలో పేరుకే శ్రావణి.. పెత్తనమంతా ఆలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డి చేతుల్లోనే ఉండటంతో ఎస్సీలు రగిలిపోతున్నారు. 

మడకశిరలో ఈరన్నకు అవమానం 
ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ఉన్న మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్నకు రిక్తహస్తం ఎదురైంది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన  గుండుమల తిప్పేస్వామిని సమన్వయకర్తగా నియమించడంపై ఎస్సీలు రగిలిపోతున్నారు. తిప్పేస్వామి పారీ్టలు మారుతూ పదవులున్న చోటుకే వెళ్తుంటారని పేరు. ఇలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టి తమను ఏం చేయాలనుకుంటున్నారని ఈరన్న వర్గం కోపంతో ఉంది. ఇకపై తిప్పేస్వామి ఎవరికి చెబితే వారికి టికెట్‌ ఇచ్చే పరిస్థితి ఉందని, ఇదే జరిగితే ఈరన్న రెబల్‌గా మారే అవకాశం లేకపోలేదని సమాచారం.  

దాడులు జరుగుతున్నా దిక్కేది? 
ఇటీవల కళ్యాణదుర్గంలో ఎస్సీలపై దాడులు   జరిగినపుడు.. సమీప నియోజకవర్గంలో లోకేష్‌ పాదయాత్ర చేస్తున్నారు. టీడీపీ నేత ఉన్నం మారుతీచౌదరి వర్గం ఓ దళితుడిపై దాడి చేసింది. బండారుశ్రావణి తండ్రిపై దాడిచేసినా లోకేష్‌ మాట మాత్రంగానైనా పరామర్శించకపోవడంతో ఎస్సీ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.

బీసీలనూ తొక్కేస్తున్నారు.. 
టీడీపీలో ఎస్సీ, ఎస్టీలనే కాదు బీసీలనూ తొక్కేస్తున్నారని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఈడిగ వర్గానికి చెందిన బొమ్మగౌని కిరణ్‌కుమార్‌గౌడ్‌ టీడీపీకి రాజీనామా చేశారు. ముప్పై ఏళ్లుగా టీడీపీ కోసం కృషి చేసినా కనీసం అనుబంధ సంఘాల్లో కూడా స్థానం ఇవ్వలేదని, ఈ పార్టీ బీసీలను అణగదొక్కుతోందని ఆరోపించి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంకా తనలాంటి ఎందరో బీసీ నేతలు పార్టీలో నలిగిపోతున్నారని, త్వరలోనే బయటకు వస్తారని చెప్పారు.  

మైనారీ్టల పరిస్థితీ అంతే.. 
ఉమ్మడి అనంతపురం జిల్లాలో మైనార్టీల పరిస్థితి కూడా తెలుగుదేశం పారీ్టలో దారుణంగా ఉంది. 2014లో కదిరి నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గెలిచిన అత్తార్‌ చాంద్‌బాషాను టీడీపీలోకి చేర్చుకుని అవసరానికి వాడుకుని ఇప్పుడు వదిలేశారు. అక్కడ కందికుంట ప్రసాద్‌ వైపే మొగ్గుచూపారు. కదిరిలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉంది. కానీ చాంద్‌బాషా స్వపక్షంలోనే విపక్షం లాగా కందికుంటతో రోజూ యుద్ధం చేయాల్సి వస్తోంది.  

మరిన్ని వార్తలు