మున్సిపల్‌ అధికారులపై రెచ్చిపోయిన ‘రావి’

8 Feb, 2023 03:36 IST|Sakshi
మున్సిపల్‌ అధికారులను వేలు చూపిస్తూ దూషిస్తున్న టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు

గుడివాడలో ఆక్రమణలు తొలగిస్తున్న అధికారులపై టీడీపీ నేత దౌర్జన్యం 

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుడివాడరూరల్‌: హైకోర్టు  ఆదేశాల మేరకు గుడివాడలో ఆక్రమణలు తొలగిస్తున్న మున్సిపల్‌ అధికారులపై టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు రెచ్చిపోయారు. ఉద్యోగుల విధులకు అడ్డుతగిలి బూతులు తిడుతూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. గుడివాడలోని నాగవరప్పాడు–లింగవరం చానల్‌ను ఆక్రమించుకుని ఏడుగురు ఇళ్లు నిర్మించుకున్నారు. దీంతో మురుగు నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతోందని అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోరుతూ ఆ ప్రాంతంలో సొంత స్థలం కలిగిన మలిరెడ్డి శ్రీనివాసరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేసిన హైకోర్టు... అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఆదేశించింది.

కోర్టు ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించాలని సచివాలయ ఉద్యోగులు మూడు నెలల కిందట ఆక్రమణదారులకు నోటీసులు ఇచ్చారు. ఆక్రమణలో ఉన్నవారికి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేసింది. నలుగురు స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేశారు. ముగ్గురు మాత్రం ఖాళీ చేయలేదు. దీంతో ఫిర్యాదుదారుడు మళ్లీ హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే ఆక్రమణలు తొలగించాలని ఆదేశించింది.

మున్సిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ రంగారావు, టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ నాగేంద్రప్రసాద్, సిటీ ప్లానర్‌ వై.రాంబాబు, మున్సిపల్‌ సిబ్బంది, ఇరిగేషన్‌ అధికారులు, పోలీసులతో కలసి సోమవారం ఆక్రమణలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా... రావి వెంకటేశ్వరరావు తమ పార్టీ నాయకులతో కలసి వచ్చి అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రావి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేసి మంగళవారం కోర్టులో హాజరుపరచగా, రూ.20వేలు వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. 

మరిన్ని వార్తలు