ఏమీ సేతుర లింగా..

25 Feb, 2021 04:44 IST|Sakshi

చంద్రబాబుకు కుప్పం దిగులు

సొంత నియోజకవర్గంలో సీన్‌ రివర్స్‌

ఎదురుతిరిగిన నేతలు, కార్యకర్తలు 

పంచాయతీ ఎన్నికల్లో పట్టించుకోలేదని ఆగ్రహం

మళ్లీ దగ్గరకు తీసుకోవాలని హుటాహుటిన కుప్పం పర్యటన

‘సొంత నియోజకవర్గంలో ఏం జరుగుతోందో తెలుసుకోకుండా ఎంతసేపు ప్రచారం కోసమే పాకులాడారు. దీనివల్లే తుదకు అభాసుపాలయ్యారు. ఇప్పుడు నిత్యం సమీక్షల మీద సమీక్షలు చేస్తూ లేని బలాన్ని ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరికాదని చెప్పిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుప్పం పర్యటన అంటే చంద్రబాబు ఎంతగా భయపడి బెంబేలెత్తిపోతున్నారో ఇంతకంటే నిదర్శనం అవసరమా? అధినేతే ఇంతగా భయపడితే మా గతి ఏమిటి?’ అని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు.

సాక్షి, అమరావతి: మొన్నటి దాకా తనకు కంచుకోటలా ఉన్న కుప్పం నియోజకవర్గం పంచాయతీ ఎన్నికల్లో కూలిపోవడంతో చంద్ర బాబు తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారు. 1989 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో అయినా గెలుస్తూ వస్తున్న చోట తొలిసారి ఓటమి ఎదురవ్వడంతో ఏం చేయాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. 74 పంచాయతీల్లో తాను నిలబెట్టిన అభ్యర్థులు ఓడిపోవడం సామాన్య విషయం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం ఉంటుందనే ఆందోళన ఆయనతోపాటు ముఖ్య నాయకుల్లో వ్యక్తమవుతోంది. కుప్పం ఓటమి ప్రభావం రాష్ట్రం అంతటా ఉంటుందని ఆ పార్టీ సీనియర్‌ నేతలు విశ్లేషిస్తున్నారు. తామే గెలిచామని చేసే ప్రచారం ప్రజలను నమ్మించేందుకే తప్ప, క్షేత్ర స్థాయిల్లో వాస్తవ పరిస్థితులు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయనే విషయం పార్టీలోని అన్ని స్థాయిల్లో ఉన్న నాయకులకూ తెలుసని చెబుతున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా చంద్రబాబు కూడా ఇదే భయంతో ఆందోళన చెందుతున్నట్లు ఆ పార్టీ ప్రముఖుడు ఒకరు తెలిపారు. కానీ తన భయాన్ని బయట పెట్టకుండా తన ఓటమికి అధికార పార్టీయే కారణమని ప్రచారం చేయడం ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

బాబుపై కుప్పం కార్యకర్తల ఆగ్రహం 
కుప్పం కార్యకర్తలు తిరుగుబాటు చేయడం చంద్రబాబుకు మింగుడు పడటం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మంగళవారం జరిగిన కుప్పం నియోజకవర్గ సమావేశంలో.. పోటీ చేసిన అభ్యర్థులు ఒక్కసారిగా స్థానిక నేతలపై విరుచుకు పడడం అక్కడి పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. తమను బలవంతంగా పోటీ చేయించారని, నామినేషన్‌ వేశాక పట్టించుకునే నాథుడే లేడని వారు వాపోయారు. కనీసం ప్రచారానికి సైతం నియోజకవర్గ, మండల నాయకులు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తమను వాడుకుని వదిలేశారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే చేస్తున్నారని నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ గౌరువాని శ్రీనివాసులు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ మునిరత్నం, పీఏ మనోహర్‌పై విరుచుకుపడ్డారు. దీంతో వాళ్లు ముగ్గురూ రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఓడిపోయిన సర్పంచ్‌ అభ్యర్థులు, గ్రామాల్లో కీలక నాయకులు వారిని పట్టించుకోకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు.

సర్దుబాటు సాధ్యమవుతుందా?
ఈ నేపథ్యంలో చంద్రబాబు హుటాహుటిన శుక్రవారం కుప్పం వెళుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో దారుణ పరాజయం స్పష్ట మైన రోజే కుప్పంలో తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గమనించిన ఆయన వైఎస్సార్‌ సీపీ దౌర్జన్యం వల్లే ఓడిపోయామనే పల్లవి అందుకున్నారు. కానీ కుప్పం నేతల సమావేశం తెలుగుదేశం పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేయడం తో అందరికీ వాస్తవం అవగతమవుతోంది. కుప్పం పర్యటనలో పంచాయతీల వారీగా సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయిం చారు. ఈ సమీక్షల ద్వారా నాయకుల్లో భరోసా నింపాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ వీటివల్ల ప్రయోజనం లేదని, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇలా గే రోజూ సమీక్షలు చేసి, కొంప ముంచారని నాయకులు వాపోతున్నారు. అభ్యర్థులు, నాయ కులకు సరైన అండదండలు ఇవ్వకుండా, టెలీకాన్ఫరెన్స్‌లు, వీడియో కాన్ఫరెన్స్‌లతో కాల క్షేపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు