అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో తెనాలి శిల్పులు

31 Oct, 2021 04:08 IST|Sakshi

ఇనుప వ్యర్థాలతో రూపొందించిన కళాఖండాలు

తెనాలి: ఇనుప వ్యర్థాలతో శిల్పకళా ఖండాలను తీర్చిదిద్దుతూ అంతర్జాతీయ గుర్తింపును పొందిన తెనాలికి చెందిన కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్రలు అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదయ్యారు. స్థానిక సూర్య శిల్పశాల నిర్వాహకులైన ఈ తండ్రీకొడుకులు పదేళ్లుగా ఇనుప వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను రూపొందిస్తున్నారు. వీటిలో 75 వేల ఇనుప నట్లతో మహాత్మాగాంధీ, ప్రధాని మోదీ నిలువెత్తు విగ్రహాలు ఉన్నాయి. ఇవికాకుండా జీప్, ఆటో, స్కూటర్, మహిళ, సింహంతో సహా మరెన్నో కళాఖండాలను ఇనుప నట్లతో తయారు చేశారు.

ఇంతవరకు 100 టన్నుల ఇనుప వ్యర్థాలను ఇందుకోసం వినియోగించారు. ఇంత భారీ మొత్తంలో ఐరన్‌ స్క్రాప్‌ను వాడి, తయారైన భారీ శిల్పకళాఖండాలను దేశంలోని పలు రాష్ట్రాలతో సహా విదేశాలకు పంపారు. వీటన్నిటిని గుర్తించి వెంకటేశ్వరరావు, రవిచంద్ర పేర్లు అమెరికా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదు చేసింది. ఈ మేరకు సంబంధిత సంస్థ శనివారం వీరికి అధికారిక సమాచారాన్ని పంపింది. 

మరిన్ని వార్తలు