మత్స్యకారులకు కష్టాలుండవిక

1 Oct, 2023 04:48 IST|Sakshi

ఆరు ఫిష్‌ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణం చేపట్టిన ఏపీ మారిటైమ్‌ బోర్డు 

భీమిలి, రాజయ్యపేట, చింతపల్లి, రాయదరువు, దొండవాక, ఉప్పలంకల్లో నిర్మాణం 

ప్రస్తుతం ఈ రేవుల దగ్గర 1,732 బోట్లు  

సాక్షి, అమరావతి: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారుల కష్టాలను తీర్చడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. మత్స్యకారుల కోసం రాష్ట్రంలో ఆరు ఫిష్‌ల్యాండ్‌ సెంటర్ల నిర్మాణానికి ఏపీ మారిటైమ్‌ బోర్డు (ఏపీఎంబీ) చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో రూ.3,500 కోట్లతో మినీ ఓడరేవులను తలపించేలా ఫిషింగ్‌ హార్బర్లు నిర్మిస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం..  తాజాగా మత్స్యకారులు వారి బోట్లను సురక్షితంగా నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకునేలా ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తోంది.

తొలి దశలో ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల నిర్మాణానికి రాష్ట్ర మత్స్య శాఖ ఏపీ మారిటైమ్‌ బోర్డుకు బాధ్యతలు అప్పగించింది. విశాఖపట్నం జిల్లా భీమిలి, అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక, విజయనగరం జిల్లా చింతపల్లి, తిరుపతి జిల్లా రాయదరువు, కాకినాడ జిల్లా ఉప్పలంకల్లో ఈ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాల్లోని మత్స్యకారులు తమ పడవలను బీచ్‌ల్లోనే నిలుపుకొని చేపలను ఒడ్డుకు చేర్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తుపాన్లువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పడవలు, వలలు కొట్టుకుపోయి పేద మత్స్యకారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్‌ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పడవలను నిలుపుకొనేందుకు ఒక జెట్టీ ఏర్పాటు చేసి, అక్కడి నుంచి చేపలను సురక్షితంగా మార్కెట్‌కు తరలించుకునేలా వీటిలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఫిషింగ్‌ హార్బర్లలో భారీ మెకనైజ్‌డ్‌ బోట్ల కోసం బ్రేక్‌ వాటర్‌ వంటివి ఉండాలని, కానీ ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లలో స్థానిక మత్స్యకారులు చిన్న నాటు పడవలు, మెకనైజ్డ్‌ బోట్లను నిలుపుకొనేలా అభివృద్ధి చేస్తామన్నారు.

ఆరు ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్ల ఏర్పాటుకు పర్యావరణ, కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్, ఏపీ కోస్టల్‌జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీల నుంచి అనుమతులు పొందడానికి కన్సల్టెన్సీ ఎంపికకు టెండర్లు పిలిచినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ఆరు ప్రాంతాల్లో ఎంతమంది మత్స్యకారులు ఉన్నారు, సముద్రపు ఒడ్డున ఎన్ని పడవలు నిలుపుతున్నారన్న అంశాలపై అధ్యయనం చేశామని, దీనికి అనుగుణంగా ఈ ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్స్‌ను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ఈ ఆరు చోట్ల 1,732 బోట్లు నిలుపుతున్నారని, ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో బోట్లను నిలిపేలా వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వీరంతా అనధికారికంగా చేపల వేట చేపడుతుండటంతో ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందలేకపోతున్నారని, ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్స్‌ ఏర్పాటయితే ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందని అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు