యూకే గురుద్వారాలో భారత హైకమిషనర్‌ అడ్డగింత

1 Oct, 2023 04:48 IST|Sakshi

స్కాట్‌లాండ్‌లో రెచ్చిపోయిన సిక్కు యువకులు

అవమానించారంటూ మండిపడిన భారత హైకమిషన్‌ కార్యాలయం

లండన్‌: ఖలిస్తాన్‌ సానుభూతిపరుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కెనడాతో ఖలిస్తాన్‌ అంశంలో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే అవి యూకేకు కూడా పాకాయి. స్కాట్‌లాండ్‌లోని గ్లాస్గో నగరంలో ఒక గురుద్వారాలోకి వెళ్లకుండా భారత హైకమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామిని ఖలిస్తానీ అతివాదులు అడ్డుకున్నారు. ఖలిస్తాన్‌ టైగర్‌ ఫోర్స్‌ చీఫ్‌ (టీఎఫ్‌సీ) హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్కాట్‌లాండ్‌లో ఖలిస్తానీ సిక్కు యువత రెచ్చిపోవడం ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో ఉన్న దొరైస్వామి అల్బర్ట్‌ డ్రైవ్‌లోని గ్లాస్గోలో గురుద్వారా గురు గ్రంథ సాహిబ్‌ కమిటీ సభ్యులతో సమావేశమవడానికి శుక్రవారం వచ్చారు. ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఖలిస్తానీ యువత  ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. గురుద్వార సిబ్బందిని కూడా వారు బెదిరించారు. ఈ క్రమంలో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గురుద్వారా కమిటీ ఆహ్వానం మేరకే భారత హైకమిషనర్‌ అక్కడికి వచ్చినా సిక్కు యువకులు వారిని అడ్డుకున్నారు. ఇద్దరు యువకులు విక్రమ్‌ దొరైస్వామి కూర్చున్న కారు తలుపుని తీయడానికి ప్రయత్నించారు. దీంతో మరింత ఘర్షణని నివారించడానికి దొరైస్వామి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.

అడ్డుకోవడం అవమానకరం
దొరైస్వామి కాన్వాయ్‌ని ఖలిస్తానీ సానుభూతిపరు లు అడ్డుకోవడాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బ్రిటన్‌ ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకువెళ్లింది. మరోవైపు లండన్‌లో భారత హైకమిషన్‌ ఈ చర్యను ఉద్దేశపూర్వకంగా అవమానించారంటూ మండిపడింది. బ్రిటన్‌ ప్రభుత్వానికి, పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు