అడవి చెప్పిన కథ.. అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం

13 Feb, 2022 13:13 IST|Sakshi

అక్షరాలే ఆదివాసీల ఆరాధ్య దైవాలు  అమ్మభాష కోసం ఆలయాల నిర్మాణం

సవర భాష లిపిని అర్చిస్తున్న అరుదైన సంప్రదాయం

జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అక్షర ఉద్యమం

అనగనగనగా ఓ అడవి. ఆ అడవిలో కొన్ని అరుదైన కోవెలలు. ఆ మందిరాల్లో మంత్రాలు లేకుండా పూజలు. ఆ అర్చనలకు ఫలితంగా అక్షర జ్ఞానం. తమ ఉనికికి ఊపిరి పోసేందుకు, వేల ఏళ్ల నాటి భాషను బతికించుకునేందుకు, అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు ఆదివాసీలు నట్టడవిలో వెలగించిన చైతన్య దివిటీలు ఈ దేవాలయాలు. సకల దేవతల సమాహారంగా అక్షరాలు కొలువై ఉన్న ఈ ఆలయాలను చూడాలంటే జనాలను దాటి వనంలోకి వెళ్లాలి. సిక్కోలు మన్యంలోని భామిని మండలాన్ని పలకరించాలి. అక్కడ అడవి చెప్పే స్ఫూర్తి కథను వినాలి. 

భామిని: భామిని మండలంలోని మనుమకొండ, పాలవలసలో రెండు ఆలయాలు విభిన్నంగా ఉంటాయి. ముక్కోటి దేవతల్లో ఒక్కరిని కూడా అక్కడ ప్రతిష్టించలేదు. అష్టోత్తరాలేమీ రాయలేదు. ప్రత్యేక ప్రార్థనలంటూ ఏమీ లేవు. అక్కడ కనిపించేవి కేవలం అక్షరాలు. అవును.. అచ్చంగా అక్షరాలే.

సవర లిపిని ఆలయాల్లో ప్రతిష్టించి వాటిని పూజలు చేసే గొప్ప సంప్రదాయం ఈ రెండు గ్రామాల్లో కనిపిస్తోంది. ఆదివాసీలు చిత్రాల్లో దైవ రూపాలను గుర్తించి పూ జించడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అందుకే తమ అమ్మ భాషను లిపి రూపంలో ఆరాధిస్తున్నా రు. ఈ ఆలయాల ఆలోచన వె నుక ఓ ఉద్యమమే దాగి ఉంది.  ఆ ఉద్య మం పేరు మతార్బనోమ్‌. మత్‌ అంటే దృష్టి, తార్‌ అంటే వెలుగు, బనోమ్‌ అంటే విస్తరించడం కలిపి.. మన దృష్టి వెలుగులో భాషను విస్తరించడం అని అర్థం.

అక్షర జ్ఞానం కోసం.. 
సవర భాష చాలా పురాతనమైనది. కానీ లిపి లేకపోవడంతో సరైన గుర్తింపునకు నోచుకోలేదు. ఆ లిపిని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఓ ఉద్యమమే జ రిగింది. అందులో భాగమే ఈ అక్షర బ్రహ్మ ఆల యాలు. ఎప్పుడో 1936లో సవర పండిత్‌ మంగ య్య గొమాంగో ఈ లిపికి అక్షయ తృతీయ నాడు రూపం ఇచ్చారు. పుష్కర కాలం కష్టపడి తయారు చేసిన ఈ లిపి గిరిజనుల ఇళ్లకు చేరాలంటే ఏం చే యాలని ఆలోచించగా.. తట్టిన మహత్తర ఆలోచనే అక్షర బ్రహ్మ దేవాలయాలు.

గిరిజన గ్రామాల్లో ఆలయాలు నిర్మించి అందులో అక్షరాలను ప్రతిష్టించి వాటి ద్వారా గిరిజనులను చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించారు. దాని ఫలితంగా లిపి ఇంటింటికీ చేరింది. అంతే కాదు ఆదివాసీల్లో గల మద్యం, వివిధ రకాల మాంస భక్షణ వంటి దురాచారాల నుంచి దూరం చేసేందుకు కూడా ఈ మందిరాలు వేదికలుగా ఉపయోగపడుతున్నాయి.  

విగ్రహాలు ఇవే..  
సవర పండిత్‌ మంగయ్య గొమాంగో 24 అక్షరాలను రూపొందించి వాటిని చిత్రాల రూపంలో మలిచి ఆలయాల్లో ప్రతిష్టించారు. ఈ 24 అక్షరాలలో 16 హల్లులు, 8 అచ్చులు ఉంటాయి. అప్పట్లో అక్షర బ్ర హ్మ ఉద్యమం సరిహద్దులు దాటి అడవి గుండా వ్యాపించింది. ఆ సందర్భంలోనే భామిని మండలం మనుమకొండ, పాలవలసలోనూ అక్షరబ్రహ్మ ఆల యాలు ఏర్పాటయ్యాయి. సతివాడ సమీపంలో బొడమ్మమెట్టపై కొత్తగా అక్షరబ్రహ్మ ఆలయం ఇటీవల ఏర్పాటైంది.

సీతంపేట మండలం నౌగడ, ముత్యాలు, శంభాంలలోనూ, విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండలం కన్నాయిగూడ, లక్కగూడలోనూ తర్వాత అక్షరబ్రహ్మ అలయాలు వెలిశా యి. జామిగూడ, సతివాడ, నౌగడ తదితర గ్రామా ల్లో అక్షర బ్రహ్మ యువ నిర్మాణ సేవా కేంద్రాలు పేరున ప్రచార మందిరాలు వెలిశాయి. 

జాతీయ స్థాయిలో..  
ఇటీవల మనుమకొండలో జరిగిన అక్షరబ్రహ్మ యువ నిర్మాణ సేవా సంఘం జాతీయ స్థాయి సదస్సులో ఐదు రాష్ట్రాల ప్రతినిధులు, మతార్బనోమ్‌ ప్రచారకులు సవరభాషను జాతీయ భాషగా తీర్చిదిద్దడానికి తీర్మానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సరవభాషా ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి నిర్ణయించారు.

ఒడిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి గిరిధర గొమాంగో, మాజీ ఎమ్మెల్యే రామూర్తి గొమాంగో, సవర భాషను ఆవిష్కరించిన మంగయ్య కుమారు డు, సవర లిపి ప్రచార జాతీయ అధ్యక్షుడు డిగాన్సిమ్‌ గొమాంగో, అసోం నుంచి వచ్చిన పాగోని బోయా, గాబ్రియల్‌ బోయా, లోక్మి బోయాలు చర్చించారు. సవర భాష ప్రాచుర్యానికి చెందిన పుస్తకాల స్టాల్స్, సవర లిపి కరపత్రాలు, మేగజైన్లు, పోస్టర్లు ప్రదర్శించాలని నిర్ణయించారు.  

ప్రతి ఆదివాసీ ఇంట.. 
మా భాషకు లిపిని అందించిన సవర పండిత్‌ మంగయ్య గొమాంగో మాకు ఆరాధ్య దైవం. అక్షర బ్ర హ్మ ప్రచార కార్యక్రమాన్ని ప్రతి ఆదివాసీ ఇంటికీ చేర్చుతున్నాం. అక్షర బ్రహ్మ ఆలయాలు నిర్మించలేని చోట అక్షర బ్రహ్మ ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రత్యేక పూజలతో సవర లిపి ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. 
– సవర కరువయ్య, జిల్లా కోఆర్డినేటర్, అక్షర బ్రహ్మ ప్రచారకుల సంఘం, సతివాడ 

సవర భాషలో బోధిస్తాం..  
సవర భాషలోని పదాలు, వాడుక వస్తువులను సవర లిపిలో వివరిస్తున్నాం. గిరిజన గ్రామాల్లో సమావేశాలు పెట్టి ఇతర భాషలతో పాటు సవర భాష అక్షరాలతో పదాలు, అర్థాలు బోధిస్తున్నాం. సవర భాషకు గుర్తింపు తీసుకురావడానికి రాత్రింబవళ్లు కొండలపై తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. 
– పత్తిక సాయన్న, ప్రచారకుడు, అక్షరబ్రహ్మ యువసేవా సంఘం, మనుమకొండ

మరిన్ని వార్తలు