‘సింహాద్రి అప్పన్న’కు యునెస్కో గుర్తింపునకు యత్నాలు

12 Aug, 2021 08:17 IST|Sakshi
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డితో చర్చిస్తున్న సింహాచల దేవస్థాన ఈవో సూర్యకళ

ఏయూ వీసీని కలిసిన సింహాచలం ఈవో 

శిల్పాలు, శాసనాల అధ్యయానికి  

నిపుణులతో బృందాన్ని పంపిస్తామని  వీసీ హామీ

సింహాచలం(పెందుర్తి): సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని బుధవారం కలిసి కోరారు. రామప్ప ఆలయానికి మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు.

11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. వీటి గురించి భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయ  త్నిస్తాయన్నారు. 

సహకారం అందిస్తాం..
ఆలయ శిల్పకళ, శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు సింహాచలం దేవస్థానానికి ఉన్నాయని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారని ఈవో తెలిపారు.  

మరిన్ని వార్తలు