భక్తులకు మరింత సులభతరంగా ‘తిరుమల’ గదులు

20 Apr, 2021 09:03 IST|Sakshi

తిరుమల: ఆన్‌లైన్‌లో ముందస్తుగా బుక్‌ చేసుకున్న యాత్రికులు తిరుమలలో మరింత సులభతరంగా గదులు పొందేలా టీటీడీ పలు మార్పులు తీసుకొచ్చింది. ఇందుకోసం తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం, అలిపిరి టోల్‌గేట్, శ్రీవారి మెట్టు వద్ద గదుల రశీదుల స్కానింగ్‌ కేంద్రాలను సోమవారం ప్రారంభించింది. వీటితోపాటు ఓఆర్‌వో జనరల్‌ కార్యాలయంలో ఇదివరకే ఉన్న కౌంటర్ల వద్ద గదుల రశీదులను స్కాన్‌ చేసుకోవచ్చు. నూతన విధానంలో యాత్రికులు సీఆర్‌వో కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశారు.

యాత్రికులు గదుల రిసిప్టును స్కాన్‌ చేయించుకున్న కొంత సమయంలోనే రిజిష్టర్డ్‌ మొబైల్‌ నంబరుకు సబ్‌ ఎంక్వైరీ కార్యాలయ వివరాలు పంపుతారు. తద్వారా యాత్రికులు నేరుగా గదులు పొందే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా, త్వరలో తిరుమలలో సీఆర్వో కార్యాలయాన్ని వికేంద్రీకరించి ఆరు ప్రాంతాల్లో 12 రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాట్‌మెంట్‌ కౌంటర్లను సబ్‌ ఎంక్వైరీ కార్యాలయాలకు తరలిస్తారు.  

హోటల్లోకి దూరి పాము కలకలం
తిరుమలలోని వేణుగోపాలస్వామి ఆలయం సమీపంలోని ఓ హోటల్లోకి జెర్రిపోతు దూరి కలకలం సృష్టించింది. హోటల్లోకి పాము దూరినట్లు నిర్వాహకులు టీటీడీ అటవీ ఉద్యోగి భాస్కరనాయుడుకి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన లోపల దూరిన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం దానిని సురక్షిత ప్రాంతంలో విడిచిపెట్టారు.

బహ్మోత్సవాల్లో వాహన సేవలు రద్దు 
ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై 23వ తేదీ నుంచి నిర్వహించనున్న దుర్గా మల్లేశ్వర స్వామివార్ల చైత్రమాస బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను రద్దు చేస్తూ ఆలయ ఈవో భ్రమరాంబ ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చైత్రమాస బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా తీవ్రత నేపథ్యంలో భక్తులు, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది భద్రత దృష్ట్యా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను నిలుపుదల చేయాలని దేవస్థాన వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది వాహన సేవల స్థానంలో పల్లకీ సేవ నిర్వహించాలని నిర్ణయించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులంతా తప్పనిసరిగా మాస్క్‌లు, శానిటైజర్లను వినియోగించాలని ఈవో  సూచించారు. 

చదవండి: కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌గా జవహర్‌రెడ్డి

మరిన్ని వార్తలు