కాషన్‌ డిపాజిట్‌పై దుష్ప్రచారం

30 Aug, 2022 04:40 IST|Sakshi

భక్తుల ఖాతాల్లోకే కాషన్‌ డిపాజిట్‌ సొమ్ము 

అవాస్తవాలను నమ్మొద్దన్న టీటీడీ 

ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై పోలీసులకు ఫిర్యాదు 

తిరుమల: కాషన్‌ డిపాజిట్‌ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటోందని, ఈ కారణంగానే ఆలస్యంగా భక్తుల ఖాతాల్లోకి చేరుతోందని కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అవాస్తవాలను భక్తులు నమ్మొద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కాషన్‌ డిపాజిట్‌ సొమ్ము భక్తుల ఖాతాలకే చేరుతోందని పేర్కొంది. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేసిన ఎమ్మెల్సీ బీటెక్‌ రవిపై టీటీడీ అధికారులు సోమవారం తిరుమల టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు కరెంట్‌ బుకింగ్, ఆన్‌లైన్‌ బుకింగ్‌ విధానంలో గదులు బుక్‌ చేసుకుంటున్నారు.

భక్తులు గదులు ఖాళీ చేసిన తర్వాతి రోజు మధ్యాహ్నం మూడు గంటల్లోపు కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ ఎలిజిబిలిటి స్టేట్‌మెంట్‌ అధీకృత బ్యాంకులైన ఫెడరల్‌ బ్యాంకు లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులకు చేరుతుంది. ఈ బ్యాంకుల అధికారులు అదే రోజు అర్ధరాత్రి 12 గంటల్లోపు(బ్యాంకు పనిదినాల్లో) సంబంధిత మర్చంట్‌ సర్వీసెస్‌కు పంపుతారు. మర్చంట్‌ సర్వీసెస్‌ వారు మరుసటి రోజు కస్టమర్‌ బ్యాంకు అకౌంట్‌కు పంపుతున్నారు. కస్టమర్‌ బ్యాంకు వారు సంబంధిత అమౌంట్‌ కన్ఫర్మేషన్‌ మెసేజ్‌(ఏఆర్‌ నంబర్‌)ను, సొమ్మును సంబంధిత భక్తుల అకౌంట్‌కు పంపుతారు.

కస్టమర్‌ బ్యాంకు వారు భక్తుల అకౌంట్‌కు సొమ్ము చెల్లించడంలో జాప్యం జరుగుతోందని టీటీడీ గుర్తించింది. ఒకవేళ భక్తులు సమస్యను.. యాత్రికుల సమాచార కేంద్రాలు, కాల్‌ సెంటర్, ఈ–మెయిల్‌ ద్వారా టీటీడీ దృష్టికి తెచ్చిన పక్షంలో పైవివరాలతో సంబంధిత బ్యాంకుల్లో విచారణ చేయాలని భక్తులకు సూచిస్తున్నారు. రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం 7 బ్యాంకు పని దినాల్లో కాషన్‌ డిపాజిట్‌ రీఫండ్‌ చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది జూలై 11 నుంచి 4, 5 రోజుల్లో రీఫండ్‌ చేరేలా టీటీడీ యూపీఐ విధానాన్ని అనుసరిస్తోంది. దీనివల్ల నేరుగా భక్తుల అకౌంట్‌కే రీఫండ్‌ సొమ్ము జమవుతోంది. వాస్తవాలను నిర్ధారించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు హెచ్చరిస్తున్నారు.     

మరిన్ని వార్తలు