రెండేళ్లలో 2,030 గుండె శస్త్రచికిత్సలు

9 Nov, 2023 04:52 IST|Sakshi

ఎనిమిది మందికి గుండె మార్పిడి

శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం సేవలు అద్భుతం

టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి

తిరుపతి తుడా/తిరుమల: టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు చేశారని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. అలాగే ఎనిమిది మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేయగా, ఏడు విజయవంతమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డితో కలిసి ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదే­శ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారని తెలిపారు.

ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి నేతృత్వంలో 15 మంది వైద్య బృందం శస్త్రచికిత్సల్లో 95 శాతం సక్సెస్‌ రేట్‌ సాధించడం అభినందనీయ­మన్నారు. ఇటీవల రాష్ట్రంలోనే ఉత్తమ ఆస్పత్రిగా అవార్డు అందుకోవడం అందుకు నిదర్శనమన్నారు. ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర ప్రభుత్వ హెల్త్‌ స్కీమ్‌ కింద ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆస్పత్రి డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ త్వరలో 350 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుందని తెలిపారు. అనంతరం గుండె మార్పిడి చేసుకున్న గుంటూరుకు చెందిన సుమతి(31), కైకలూరుకు చెందిన కరుణాకర్‌(39)ను డిశ్చార్జి చేశారు.

కాగా, అలిపిరి నడకమార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న ఒక విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణులు నివేదిక సమర్పించారని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ మండపం నిర్మాణం విషయమై కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు