AP Rain Alert: బలపడిన వాయుగుండం

3 Dec, 2021 12:29 IST|Sakshi

నేడు జవాద్‌ తుపానుగా మారే అవకాశం.. విశాఖ తీరానికి సమీపం నుంచి ఒడిశా వైపు పయనం 

45–90 కిలోమీటర్ల వేగంతో తీరంలో గాలులు 

ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు.. వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక  

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్‌ తుపానుగా మారుతుందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.

ఇది తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. శుక్రవారం అర్థరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45–65 కిలోమీటర్లు, శనివారం 70–90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు 
గురు, శుక్ర, శనివారాల్లో 95 రైళ్లను నిలిపివేస్తున్నట్లు ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఖుర్ధా డివిజన్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఇందులో విజయవాడ మీదుగా ప్రయాణించే 41 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నాయి.     

ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి
తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం ఆదేశం
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గురువారం ఉదయం ఆయన వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తుపాన్‌ వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితుల వల్ల ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్‌ అధికారులకు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లాకు హెచ్‌.అరుణ్‌కుమార్, విజయనగరం జిల్లాకు కాంతిలాల్‌దండే, విశాఖ జిల్లాకు శ్యామలరావును నియమించారు. వెంటనే ఆయా జిల్లాలకు చేరుకుని తుపాను సహాయ కార్యక్రమాల సమన్వయ, పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు.  

మరిన్ని వార్తలు