Heavy Rains In AP: నేడు వాయుగుండం.. రేపటికి తీవ్రం 

15 Nov, 2023 03:48 IST|Sakshi

నేడు సీమ, దక్షిణ కోస్తాలకు భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం/వాకాడు: ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్, నికోబార్‌ దీవులకు ఆనుకుని మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ బుధవారం నాటికి వాయుగుండంగా మారనుంది. ఆపై వాయవ్య దిశగా పయనిస్తూ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్‌ తీరానికి కాస్త దూరంలో గురువారం నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో వెల్లడించింది.

అనంతరం ఉత్తర, ఈశాన్య దిశగా మలుపు తిరిగి 17వ తేదీకి ఒడిశా తీరానికి చేరుకుంటుందని తెలిపింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ఆవర్తనం నుంచి అల్పపీడనం ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బుధవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అదే సమయంలో ఉరుములు, మెరుపులు సంభవించి.. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రానున్న రెండు రోజులు గంటకు 40–50 కి.మీ.లు, గరిష్టంగా 60 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు