Heavy Rainfall Alert For AP: నేడు అల్పపీడనం!

14 Nov, 2023 07:54 IST|Sakshi

16న వాయుగుండంగా మారే అవకాశం

నేడు, రేపు సీమ,దక్షిణ కోస్తాలకు భారీ వర్షాలు

సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 16వ తేదీ నాటికిపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి.

వీటన్నిటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురవనున్నాయి. కాగా.. మంగళవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడ క్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడింంది.

అలాగే బుధవారం తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, వైఎస్సార్‌ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, కూలీలు, పశువుల కాపరులు, రైతులు ఆరు బయట ఉండరాదని హెచ్చరింంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది.

మరిన్ని వార్తలు