ఇప్పటికే 2 నెలలు ఆలస్యం.. సందడిలేని ఉలవపాడు మామిడి..

2 May, 2022 15:02 IST|Sakshi
మామిడి కాయలు (ఫైల్‌)

మధుర ఫలంగా పేరుగాంచిన మామిడి.. వరుస సీజన్‌లో రైతులకు చేదు అనుభావాలను మిగిల్చుతోంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు మామిడి దిగుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే రెండు నెలలు ఆలస్యంగా కాయలు వస్తున్నా ఆశించిన స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు. దీంతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన ఉలవపాడు మామిడి రైతులు తీవ్రనష్టాలు చవిచూసే ప్రమాదం ఏర్పడింది.   

సాక్షి, నెల్లూరు : జిల్లాలో కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు మండలాలతో పాటు, కావలి, ఆత్మకూరు, పొదలకూరు, కలిగిరి, సైదాపురం వంటి ప్రాంతాల్లో దాదాపు 12,800 హెక్టార్లలో మామిడి సాగు జరుగుతోంది. వీటిలో ఒక్క ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లోనే 7,500 హెక్టార్ల వరకు సాగు ఉంది. ఈ ప్రాంతంలో పండే బంగినపల్లి, తోతాపురి, చెరుకు రసాలు, బెంగళూరు కాయలు వంటి మామిడి రకాలకు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలున్నాయి. ప్రతి ఏడాది వేల టన్నుల కాయలను దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు, విదేశాలకు ఎగుమతులు జరుగుతాయి. దాదాపు రెండు, మూడు నెలలపాటు సీజన్‌ జోరుగా సాగుతుంది. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా సరైన ఎగుమతులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ ఏడాది ఎగుమతులపై దిగుబడి గణనీయంగా ప్రభావం చూపుతోందని ఉద్యానవనశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.  


అంతంత మాత్రంగా కాయలు వచ్చిన మామిడిచెట్టు  

ప్రతికూల వాతావరణంతోనే.. 
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో అధిక వర్షాలు కురవడంతో మామిడి పూతపై తీవ్ర ప్రభావం పడింది. అధిక వర్షాల వల్ల పూతరావడం దాదాపు నెల రోజుల ఆలస్యమైంది. వచ్చిన పూత కూడా సక్రమంగా నిలవని పరిస్థితి ఏర్పడింది. దీంతో పిందె శాతం తగ్గిపోయి కేవలం 30 శాతం పిందె మాత్రమే తోటల్లో వచ్చింది. ఇప్పటికి కూడా కొన్ని తోటల్లో పిందెలు రాని దుస్థితి నెలకొంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా అనుకూలిస్తే ఒక ఎకరా తోటలో నాలుగు టన్నుల వరకు కాయలు వచ్చే అవకాశం ఉంది. కాని ఈ ఏడాది ఒక టన్ను నుంచి ఒకటిన్నర టన్నుల కాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. బాగా దిగుబడి వచ్చిందనుకుంటే రెండు టన్నులు మించి రాదని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎకరాకు దాదాపు రెండు నుంచి మూడు టన్నుల వరకు దిగుబడిని రైతులు నష్టపోవాల్సి వస్తోంది.  

ధరలు ఫర్వాలేదు... 
రాష్ట్ర వ్యాప్తంగా మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోవడంతో ఈ మేరకు ధరలు మాత్రం పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగినపల్లి రకం మామిడి టన్ను రూ.70 వేలు మార్కెట్‌లో పలుకుతోంది. ఈ రేటు ఇంకా పెరిగే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. అయితే డిమాండ్‌కు తగ్గట్లు కాయలు లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఎకరాకు రెండు టన్నుల లెక్కన రైతుకు దిగుబడి తగ్గినా ప్రస్తుత రేటు ప్రకారం దాదాపు రూ.1.40 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఆ విధంగా చూస్తే ఈ ఏడాది మామిడి రైతులకు కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.  

అధిక వర్షాలతో పూత సరిగ్గా రాలేదు 
అధిక వర్షాల వల్ల ఈ ఏడాది మామిడిపూతపై తీవ్ర ప్రభావం పడింది. పూత సరిగ్గా రాలేదు. వచ్చిన పూతలో కూడా కేవలం 30 శాతం మాత్రమే పిందె వచ్చింది. దీని వల్ల దిగుబడులు బాగా తగ్గుతున్నాయి. ఒక ఎకరా తోటలో ఒక టన్ను నుంచి టన్నునర కాయలు మాత్రమే దిగుబడి వస్తోంది. ప్రఖ్యాతిగాంచి ఉలవపాడు మామిడి రైతులకు ఇది నష్ట కలిగించే అంశమే.  
– బ్రహ్మసాయి, ఉద్యానవనశాఖ అధికారి 

ఎగుమతులపై ప్రభావం  
కందుకూరు నియోజకవర్గంలోని ఉలవపాడు, గుడ్లూరు ప్రాంతాల్లో పండే మామిడికి అంతర్జాతీయంగా మంచి డిమాండ్‌ ఉంటుంది. దాదాపు మూడు నెలలపాటు ఉలవపాడు కేంద్రంగా మామిడి వ్యాపారం జోరుగా సాగుతోంది. మార్చి, ఏప్రిల్, మే మాసాలు ఈ వ్యాపారానికి చాలా కీలకం. కాని ఈ ఏడాది ఇప్పటివరకు మార్కెట్‌లోకి కాయలు రాని పరిస్థితి ఉంది. ఇది ఉలవపాడు నుంచి జరిగే మామిడి ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది విదేశాలకు దాదాపుగా ఎగుమతులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. గత రెండు, మూడు సంవత్సరాలుగా ఉదే పరిస్థితి ఉంది. కరోనా ఆంక్షల వల్ల స్లాట్‌లు దొరక్క విదేశాలకు ఎగుమతులు చేయలేని పరిస్థితి. ప్రస్తుతం కాయలు లేకపోవడంతో దేశీయంగానే అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. గతేడాది 40 నుంచి 50 వేల టన్నుల వరకు మామిడి దిగుబడి ప్రాంతం నుంచి వస్తే, వీటిలో 10 వేల టన్నుల వరకు విదేశాలకు ఎగుమతులు ఉండేవని అధికారులు వెల్లడిస్తున్నారు. 

మరిన్ని వార్తలు