చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టండి

31 Oct, 2021 04:41 IST|Sakshi
కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిత్రంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

సేంద్రీయ ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలి

రైతును ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులదే

పంట మార్పిడి విధానంతోనే మేలు 

ప్రతీదీ ఉచితంగా ఇవ్వాల్సిన పనిలేదు

ఉచిత విద్యుత్‌ కాదు.. అంతరాయంలేని విద్యుత్‌ కావాలి

రైతు నేస్తం అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, అమరావతి/గన్నవరం: కరోనా కష్టకాలంలోనూ మొక్కవోని ఆత్మస్థైర్యంతో అధికోత్పత్తి సాధించిన అన్నదాతను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. యువత గ్రామాల వైపు మళ్లాలని పిలుపునిచ్చిన ఆయన వరి, గోధుమ వంటి పంటలను వదిలి ఆరోగ్యాన్ని కాపాడే చిరుధాన్యాల సాగువైపు రైతులు దృష్టిపెట్టాలని సూచించారు. కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో శనివారం జరిగిన పద్మశ్రీ డాక్టర్‌ ఐవీ సుబ్బారావు రైతునేస్తం పురస్కారాల ప్రదానోత్సవంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అగ్రి జర్నలిస్టులకు ఉపరాష్ట్రపతి అవార్డులు అందజేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఆహారపు అలవాట్లు మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు సేంద్రీయ ఆహారానికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

జనాకర్షక పథకాలతో మేలు జరగదు
రైతులకు సులువుగా రుణాలు అందించాలి. శీతల గిడ్డంగులు పెరగాలి. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే విషయంలో ప్రతీఒక్క భాగస్వామి చిత్తశుద్ధితో పనిచేయాలి. నిరాటంకంగా 10–12 గంటలు మేలైన విద్యుత్‌ను సరఫరా చేయాలి. రైతులకిచ్చే రుణాలపై వడ్డీ రేట్లు మరింత తగ్గాలి. అదే సమయంలో రైతులు కూడా అనవసరపు ఖర్చు తగ్గించుకోవాలి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. విద్యావంతులు వ్యవసాయం వైపు మరింత ఎక్కువగా రావాలి. పలు దేశాల్లో కోవిడ్‌ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. కష్టాలలో ఉన్న వారిని ఆదుకోవడంలో తప్పులేదు. కానీ, ప్రతిదాన్నీ ఉచితంగా ఇవ్వాల్సిన పనిలేదు. తాత్కాలిక జనాకర్షక పథకాలవల్ల మేలు జరగదు. చేపలు పట్టడం నేర్పాలేగానీ చేపల పంపిణీ కాదు. అలాగే, రైతులకు కావాల్సింది ఉచిత విద్యుత్‌ కాదు.. ఎటువంటి అంతరాయం లేని కరెంటు కావాలి.

సారంపల్లి, ఎర్నేనికి పురస్కారం
అఖిల భారత కిసాన్‌ సంఘ్‌ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డికి 2021 సంవత్సరానికి జీవిత సాఫల్య పురస్కారం.. రైతాంగ సమాఖ్య నాయకుడు ఎర్నేని నాగేంద్రనాథ్‌కు కృషిరత్న అవార్డును అందజేశారు. వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మరో 18 మంది రైతులకు 17 మంది శాస్త్రవేత్తలు, ఐదుగురు జర్నలిస్టులకు అవార్డులు అందజేశారు. సభలో నాబార్డ్‌ సీజీఎం సుధీర్‌కుమార్, జిల్లా కలెక్టర్‌ జె. నివాస్, మంత్రి కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ యడ్లపల్లి వెంకటేశ్వరరావు స్వాగతోపన్యాసం చేశారు. అంతకుముందు.. రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మంత్రి వెలంపల్లి, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. 

సాక్షి విలేకరికి అవార్డు
తెలంగాణలోని సూర్యాపేట జిల్లా నడిగూడెం సాక్షి గ్రామీణ విలేకరి మొలుగూరి గోపయ్యకు ఉపరాష్ట్రపతి రైతునేస్తం పురస్కారాన్ని అందజేశారు. వ్యవసాయ డిప్లొమా చదివి సొంతంగా వ్యవసాయం చేస్తూనే ఆయన విలేకరిగా పనిచేస్తున్నారు. తనను ఎంపిక చేసిన అవార్డు కమిటీకి, వార్తలు ప్రచురించిన సాక్షి పత్రిక సంపాదకవర్గానికి, యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు