దివికేగిన దోస్త్‌

6 Jan, 2021 08:40 IST|Sakshi
కళాంజలి సంస్థ ఆధ్వర్యంలో వెన్నెలకంటికి సన్మానం (చిత్రంలో గాయని సునీత, లాయర్‌ ప్రభు) (ఫైల్‌)

ఒకరు స్వర మాంత్రికుడు.. మరొకరు సిరా యాంత్రికుడు.. ఇద్దరూ సినీ ప్రపంచంలో హాలికులు.. సింహపురి ముద్దుబిడ్డలు.. ఆ ఇద్దరిదీ గురుశిష్యులు.. అన్నదమ్ములు.. స్నేహితుల అనుబంధం.. సినీ గాయకుడు ఎస్పీ బాలు దివికేగిన కొద్దినెలలకే ఆయన ఆత్మీయుడు, సినీ గేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌ మంగళవారం కన్నుమూశారు. పాటలు పాడే చందమామను వెతుక్కుంటూ వినీలాకాశంలోకి ఈ ‘వెన్నెల’ వెళ్లిపోయింది. చెన్నైలో నివాసం ఉంటున్నా.. నెల్లూరుతో విడదీయరాని అనుబంధాన్ని పెనవేసుకున్నారు. ఆయన మాట.. పాట వెన్నెలంత హాయిగా ఉండేదని స్నేహితులు జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఎస్‌బీఐలో కొలువు కాదనుకుని సినీ రంగంలో చేసిన సాహిత్య ప్రయాణం మరపురానిది.. ‘మాటరాని మౌనమిది..’ అంటూ సింహపురి మూగబోయింది. 

సాక్షి, నెల్లూరు(బృందావనం): సింహపురి శోకసంద్రమైంది. ఎస్పీ బాలసుబ్రహ్మణంను పోగొట్టుకున్న విషాదాన్ని మరువకముందే ఈ ప్రాంతానికి చెందిన సినీగేయ రచయిత వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్‌ మృతిచెందడంతో కన్నీటి సంద్రమైంది. డబ్బింగ్‌ చిత్రాలకు పాటల రచయితగా తనకంటూ ప్రత్యేకతను సృష్టించుకున్న వెన్నెలకంటి నెల్లూరులో కళాకారులందరికీ వెన్నెల కాంతులను అందించారు. కవిగా, స్నేహితుడిగా ఎన్నో కళాసంఘాలకు అధ్యక్షుడిగా తాను అందించిన ప్రోత్సాహాన్ని స్నేహితులు కంటితడి పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు. నగరంలోని ట్రంకురోడ్డు సీమా సెంటర్, పురమందిరం, టీవీఎస్‌ కల్యాణసదన్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన ఏ సంగీత, సాహిత్యసభ అయినా వెన్నెలకంటి జ్ఞాపకాలు గుర్తుతెస్తుంది. ఎస్పీబీతోపాటు వెన్నెలకంటి సినిమా కళాకారులను నెల్లూరుకు తీసుకొచ్చి చేసిన కార్యక్రమాలతో ఎందరో వర్ధమాన కళాకారులు వెలుగులోకి వచ్చారు. 

కళాంజలి సంస్థకు ఎంతో ప్రోత్సాహం
కళాంజలి సంస్థ ప్రతి కార్యక్రమంలో వెన్నెలకంటి ప్రోత్సాహం ఉండేది. సుదీర్ఘమైన ప్రయాణంలో కవిగా, స్నేహితుడిగా ఆయన అందించిన సహాయసహకారాలు మరచిపోలేము. మా సంస్థ తరఫున వెన్నెలకంటిని సన్మానించిన దృశ్యం ఇంకా కళ్లముందే కదిలాడుతోంది.
– కళాంజలి అనంత్, బెనర్జీ 

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి
వెన్నెలకంటి ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి. ఇటీవల టీటీడీకి వెన్నెలకంటి రాసిన పాటను హిందీలోకి అనువదించడం నా పూర్వజన్మ సుకృతం. 
–  డాక్టర్‌ శైలజ, కవయిత్రి, మరుపూరు కోదండరామిరెడ్డి స్మారక అవార్డు కమిటీ అధ్యక్షురాలు

బాధాకరం 
నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పాటల రచయిత వెన్నెలకంటితో సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో అనుభవాలు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నెల్లూరు కళారంగానికి సేవచేసిన ఇద్దరిని కోల్పోవడం బాధాకరం. 
– వీరిశెట్టి హజరత్‌బాబు, మురళీకృష్ణ గ్రూప్‌ ఆఫ్‌ హోటల్స్‌ ఎండీ

నా ఆరోప్రాణం
బాల్యస్నేహితుడు వాడి మరణవార్త తెలియగానే నాకు ఊపిరి ఆగినంతపనైంది. నాకు వాడు ఆరోప్రాణం. స్నేహానికి, ఆత్మీయతకు మరో రూపం వెన్నెలకంటి. కొద్దిరోజుల్లోనే బాల్యమిత్రులు బాలు, వెన్నెలకంటిలను పోగొట్టుకోవడం మరచిపోలేని విషాదం.
– యజ్ఞావఝుల శేషగిరీశం, వెన్నెలకంటి బాల్యమిత్రుడు

చేదోడువాదోడుగా ఉండేవాడు 
రాజేశ్వరప్రసాద్‌ మాకు ఎన్నో కార్యక్రమాల్లో చేదోడువాదోడుగా ఉండేవాడు. మా కమిటీ అ«ధ్యక్షుడిగా వ్యవహరించేవాడు. ఆయన మరణవార్త నివ్వెరపరచింది. సాహితీలోకానికి తీరనిలోటు. 
– చిన్ని నారాయణరావు, ప్రధానకార్యదర్శి, డాక్టర్‌ నాగభైరవ అవార్డు కమిటీ 

కళలకు తీరనిలోటు
వెన్నెలకంటి మరణం కళారంగానికి తీరనిలోటు. ఆయన లేకపోవడం అటు సింహపురికి ఇటు ఆయన్ను అభిమానించే మాలాంటి వారికి ఎంతో విషాదం. 
 – అమరావతి కృష్ణారెడ్డి, అధ్యక్షుడు, 25 కళాసంఘాలు 

సాహితీ ప్రియుడిని కోల్పోయాం
సింహపురి మధురగాయకుని కోల్పో యిన కొద్దికాలంలోనే మరో సాహితీప్రియుడిని కోల్పోయింది. ఇది సినిమా రంగానికే కాదు సాహిత్యలోకానికి తీరనిలోటు. 
– పెరుగు రామకృష్ణ, కవి

స్ఫూర్తిదాయకం
ఇరుగుపొరుగునే ఉండేవారం. ఆ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యం. కవిగా, రచయితగా వెన్నెలకంటి ఎదిగిన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇటీవల వెన్నెలకంటితో మాట్లాడాను. ఆయన లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. 
– వెల్లంచేటి చంద్రమౌళి, అధ్యక్షుడు, ఏపీ బ్రాహ్మణసేవా సంఘం సమాఖ్య

మాకు మార్గదర్శి
మా సంస్థ కార్యక్రమాల్లో మార్గదర్శిగా వ్యవహరించారు. ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. సంస్థ ఉన్నతిలో తన వంతు తోడ్పాటు ఉంది. 
 – దోర్నాల హరిబాబు, హరివిల్లు క్రియేషన్స్‌ అధినేత

మరిన్ని వార్తలు