నిర్లక్ష్యాన్ని సహించం.. వైద్య సిబ్బందికి మంత్రి విడదల రజని హెచ్చరిక

6 May, 2022 04:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, అవినీతికి పాల్పడినా ఉపేక్షించేది లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన డాక్టర్‌ బాషాను సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఈ ఉదంతంపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అందిందని.. తదుపరి క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు బాషాను హెడ్‌ క్వార్టర్‌ వదిలివెళ్లొద్దని ఆదేశించామన్నారు.

ప్రజలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే సీఎం జగన్‌ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇందుకోసమే దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైద్య రంగంలో పెనుమార్పులు తీసుకువచ్చిందని వివరించారు. మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, ఆస్పత్రుల ఆధునికీకరణ, అధునాతన వైద్య పరికరాలు.. ఇలా అన్ని విధాలుగా ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత 108, 104తో పాటు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సేవలను ప్రభుత్వం విస్తరించిందని పేర్కొన్నారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనాల ద్వారా 18,450 మంది తల్లులు, శిశువులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చామని తెలిపారు.

మరిన్ని వార్తలు