ఐబీపీఎస్‌లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించండి

24 Sep, 2023 04:42 IST|Sakshi
కేంద్ర మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌కు వినతి పత్రం అందచేస్తున్న పల్సస్‌ గ్రూపు సీఈవో గేదెల శ్రీనుబాబు

కేంద్రానికి విజయసాయిరెడ్డి లేఖ

ఈ స్కీం కింద దేశంలోనే అత్యధికంగా 5 వేల ఉద్యోగాలిచ్చిన పల్సస్‌ గ్రూపు

ఇందులో 4 వేల మంది మహిళలే

సాక్షి, అమరావతి: ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఐటీ ఆధారిత సేవలను విస్తరించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఇండియన్‌ బిజినెస్‌ ప్రమోషన్‌ స్కీమ్‌ (ఐబీపీఎస్‌)లో రాష్ట్రానికి అత్యధిక సీట్లు కేటాయించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. గ్రామీణ భారతదేశంలో మహిళలకు ఉపాధిని పెంపొందించడంలో ఐబీపీఎస్‌ కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో దేశంలోనే అత్యధికంగా ఏపీలో మహిళలకు ఉపాధి లభించిందని తెలిపారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సంయుక్తంగా నిర్వహించే ఈ పథకంలో కంపెనీలకు వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద కేంద్రం నిధులను సమకూరుస్తుంది. ఐబీపీఎస్‌ ద్వారా విశాఖపట్నం కేంద్రంగా ఉన్న పల్సస్‌ గ్రూపు 5,000 మందికి ఉపాధి కల్పించి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. వీరిలో 4,000 మంది మహిళలే.

రెండో విడత పథకం కింద రూ.41 కోట్లు పల్సస్‌ గ్రూపునకు ఎస్‌టీపీఐ విడుదల చేసింది. ఏపీలో ఐబీపీఎస్‌ సీట్లు పెంచాలని కోరుతూ పల్సస్‌ గ్రూప్‌ సీఈవో గేదెల శ్రీనుబాబు కూడా కేంద్ర మంత్రి చంద్రశేఖర న్‌కు వినతిపత్రాన్ని అందించారు. ఐబీపీఎస్‌తో ఉ పాధి కల్పన, తద్వారా ఆర్థిక వృద్ధిలో భాగస్వామ్యాన్ని అందించగలగడం తమకు దక్కిన గౌరవమని శ్రీనుబాబు చెప్పారు. దేశవ్యాప్త డిజిటల్‌ విప్లవాన్ని అందిపుచ్చుకోవడంలో తమకున్న సాటిలేని నిబద్ధతకు ఇది నిదర్శనమని అన్నారు. పల్సస్‌ గ్రూప్‌ పదిహేనేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో 25 వేలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని, వాటిలో ఎక్కువ భాగం మహిళలకు అందించిందని వివరించారు.  

మరిన్ని వార్తలు