పట్టాలెక్కిన విజయవాడ–చెన్నై వందేభారత్‌ రైలు 

25 Sep, 2023 05:36 IST|Sakshi
విజయవాడ రైల్వే స్టేషన్‌లో వందేభారత్‌ రైలు

కాచిగూడ–యశ్వంతపూర్‌ రైలు కూడా.. దేశవ్యాప్తంగా 9 వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

విజయవాడలో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ 

సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ–చెన్నై, కాచిగూడ–­యశ్వంతపూర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆదివారం పట్టాలు ఎక్కాయి. దేశవ్యాప్తంగా 9 వందేభారత్‌ రైళ్లను ప్రధాని మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేంద్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌ పాల్గొన్నారు. విజయ­వాడ రైల్వే స్టే­షన్‌ ప్లాట్‌ఫాంపైకి చేరుకున్న వందే­­భా­రత్‌ రైలుకు 1,500 మందికిపైగా విద్యా­ర్థులతో కలసి రైల్వే అధికారులు హర్షాతిరేకాలతో స్వాగతం పలికారు.

కేంద్రమంత్రి భారతి ప్రవీణ్‌ మాట్లాడుతూ..మేక్‌ ఇన్‌ ఇండియా, ఆత్మ నిర్భార్‌ భారత్, ఇండియా ఫస్ట్‌ ఇనీషియేటివ్స్‌ ఆఫ్‌ ది నేషన్‌ను ప్రోత్సహించే లక్ష్యంతో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్‌ సెమీ హైస్పీడ్‌ రైలును తయారు చేయడం దేశం సాధిస్తోన్న ప్రగతికి నిదర్శనమన్నారు. 9 నెలల్లోనే ఏపీకి 3 వందేభారత్‌ రైళ్లను కేంద్రం కేటాయించిందని చెప్పారు. రైల్వే చరిత్రలో 2023 గొప్ప మేలి మలుపుగా నిలిచిపోతుందన్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు కేంద్ర మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు జెండాలు ఊపి రైలుకు వీడ్కోలు పలికారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, దక్షిణ మధ్య రైల్వే డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో కాచిగూడ– యశ్వంతపూర్‌ వందేభారత్‌ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ రైలు ఏపీలోని కర్నూలు, అనంతపురం రైల్వే స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.  

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
విజయవాడ–చెన్నై సెంట్రల్‌కు మొట్టమొదటి వందే భారత్‌ రైలును చూసేందుకు నగరవాసులు, పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో రైల్వే స్టేషన్‌కు చేరుకోవడంతో స్టేషన్‌ సందడిగా మారింది. రైల్వేశాఖ ఆధ్వర్యంలో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పలువురు పాఠశాల విద్యార్థులు స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో ప్రదర్శించిన పలు నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.విద్యార్థులు వందే భారత్‌ రైలుతో సెల్ఫీలు తీసుకుంటూ సందడిగా గడిపారు.

మరిన్ని వార్తలు