దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు

22 Jan, 2021 09:36 IST|Sakshi

గతేడాది సెప్టెంబర్‌లో బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో చోరీ

మూడు వెండి సింహాల ప్రతిమల అపహరణ

ఇది పాత నేరస్తుడు సాయిబాబా పనేనని నిర్ధారణ

ఇతనిపై ఇప్పటికే వందకు పైగా కేసులు..

వీటిలో అత్యధికం ఆలయాలకు సంబంధించినవే

తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ బంగారం వ్యాపారికి విక్రయం

పోలీసుల అదుపులో వ్యాపారి కూడా

సాక్షి, అమరావతి బ్యూరో: బెజవాడ కనకదుర్గమ్మ గుడిలో అమ్మవారి వెండి రథానికి చెందిన మూడు వెండి సింహాల ప్రతిమలను అపహరించిన దొంగను విజయవాడ వెస్ట్‌జోన్‌ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఈ మిస్టరీకి తెరపడింది. గతేడాది సెప్టెంబరులో ప్రతిమలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసు శాఖ మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టిన ఈ బృందాలు చివరకు ఇది తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా (52) పనేనని నిర్ధారణకు వచ్చాక.. అందుకు సంబంధించిన పక్కా సాంకేతిక ఆధారాలను సేకరించాయి. వాటి ఆధారంగా జక్కంశెట్టి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ చోరీకి పాల్పడింది తానేనని అంగీకరించాడు. వాటిని తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు.

గోప్యంగా విచారణ
చోరీ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర పోలీసు కమిషనర్‌.. వెస్ట్‌జోన్‌ ఏసీపీ నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. తొలుత ఆలయంలో పనిచేసే సిబ్బందిని విచారించారు. అలాగే, ఆ సమయంలో దేవాలయ అభివృద్ధి పనుల కోసం పనిచేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు, ఈ తరహా చోరీలకు పాల్పడే పాత నేరస్తులను పోలీసులు విచారించారు. చోరీ జరిగిన సమయంలో పాత నేరస్తులు ఎక్కడ ఉన్నారు? వారి కదలికలు, ఫోన్‌ కాల్‌డేటాతోపాటు టవర్‌ లోకేషన్‌ తదితర సాంకేతిక ఆధారాలను సేకరించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పాత నేరస్తుడు జక్కంశెట్టి సాయిబాబా చోరీ జరిగిన సమయంలో దుర్గగుడి సమీపంలో ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు. వెంటనే ప్రత్యేక బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాకు పంపి సాయిబాబాను అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించి గోప్యంగా విచారిస్తున్నారు. విచారణలో తానే అపహరించినట్లు సాయిబాబా అంగీకరించాడని ఓ పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఆ వెండి ప్రతిమలను తూర్పుగోదావరి జిల్లా తునిలోని ఓ బంగారం వ్యాపారికి విక్రయించాడని, వాటిని సదరు వ్యాపారి కరిగించినట్లు తెలిసిందని, ఆ వ్యాపారిని సైతం అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. సాయిబాబాపై ఇప్పటివరకు 100కు పైగా కేసులున్నాయని.. వీటిలో అత్యధిక కేసులు ఆలయాలకు సంబంధించినవేనని వివరించారు.

దొంగ దొరికింది ఇలా.. 
ప్రత్యేక బృందంలోని ఓ ఎస్సై.. సాయిబాబా కార్యకలాపాలపై దృష్టిసారించటంతో కేసు చిక్కుముడి వీడింది. 2007, 2008 మధ్యలో జక్కంశెట్టి సాయిబాబా ఆలయాల్లో దొంగతనాలు చేయటం ప్రారంభించాడు. ఇప్పటివరకు అతనిపై వంద కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి, నరసాపురం, పాలకోడేరు, నిడదవోలు ప్రాంతాల్లోని దేవాలయాల్లో చోరీలు చేశాడు. సాయిబాబా వ్యవహారశైలి తెలిసిన ఈ ఎస్సై అతనిపై నిఘా పెట్టారు. కేసు దర్యాప్తులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఉంటున్న సాయిబాబా భార్య ఇంటికి వెళ్లి.. ‘మీకు ఇళ్ల పట్టా వచ్చింది.. మీ భర్త వివరాలు తెలియజేయండి’.. అంటూ ఎస్‌ఐ నమ్మబలికారు. దీంతో ఆమె తన భర్తకు ఫోన్‌చేయగా సాయిబాబు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.  

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ కోసం ఘటనా స్థలికి నిందితుడు
వెండి సింహాల ప్రతిమల చోరీ కేసు కొలిక్కి రావడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. మరింత లోతుగా విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా చోరీ తీరును తెలుసుకునే క్రమంలో నిందితుడు సాయిబాబాను ఘటనా స్థలానికి తీసుకెళ్లి ‘సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌’ చేయనున్నారు. కొండపైకి ఎప్పుడు చేరాడు? ఏ సమయంలో చోరీకి పాల్పడ్డాడు? తర్వాత వాటిని తీసుకుని ఏ మార్గంలో బయటపడ్డాడు? ఎక్కడ వాటిని దాచాడు? ఎవరికి విక్రయించాడు? ఇతరులు ఎవరైనా సహకరించారా? అనే అంశాలపై నిందితుడిని విచారణ చేయనున్నామని ఆ అధికారి వివరించారు.    

మరిన్ని వార్తలు