ధరలు చూసి ‘బోరు’మనాల్సిందే..!

22 Jan, 2021 09:10 IST|Sakshi

భారీగా పెరిగిన బోరు తవ్వకం ధరలు 

డీజిల్‌ ధరలు, లేబర్‌ చార్జీల పేరిట పెంపు 

రిగ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రేట్లు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: నీటి సమస్యను అధిగమించేందుకు ఇంట్లోనో... పొలం దగ్గరో బోరు వేయాలనుకుంటున్నారా.. అయితే కనీసం రెండు, మూడు లక్షలు సిద్ధం చేసుకోవల్సిందే. ఎందుకంటే బోరు తవ్వకం చార్జీలు భారీ పెరిగాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ధరలు సగటున యాభై శాతానికిపైగా పెరిగిపోయాయి. లాక్‌డౌన్, ఆ తర్వాతి పరిస్థితులు, డీజిల్‌ ధరలు, లేబర్‌ చార్జీల పెరుగుదల తదితర అంశాలను చూపుతూ రిగ్‌ ఓనర్ల సంఘం బోరు తవ్వకం ధరలను అమాంతం పెంచేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారీగా ధరల్లో కాస్త వ్యత్యాసం ఉన్నప్పటికీ... మొత్తంగా ధరల పెంపు భారీగా ఉండడంతో బోరు తవ్వించాలనున్న వాళ్లు ధరలు చూసి బెంబేలెత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

వెయ్యి ఫీట్లకు రూ.2లక్షల పైమాటే.... 
బోరు తవ్వేందుకు చార్జీల తీరు స్లాబుల ఆధారంగా ఉంటుంది. భూమిలోకి డ్రిల్‌ చేసే ప్రతి వంద ఫీట్లకు ఒక్కో ధర ఉంటుంది. లోతుకు వెళ్తున్న కొద్ది బోర్‌వెల్‌ మిషన్‌పై ఒత్తిడి పెరగడంతో ధరలను క్రమంగా పెంచుతారు. రంగారెడ్డి జిల్లాలో కోవిడ్‌–19కు ముందు బోరు తవ్వేందుకు ప్రారంభంలో తొలి వంద ఫీట్లకు (అడుగులు) ఫీట్‌కు రూ.45 చొప్పున ఉండేది. క్రమంగా ప్రతి వంద ఫీట్లకు రూ.10 చొప్పున, 500 ఫీట్లు దాటిన తర్వాత రూ.20 చొప్పున, 800 ఫీట్లు దాటిన తర్వాత రూ.50 చొప్పున ధరలు పెంచేవాళ్లు.

ప్రస్తుతం ఈ ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రారంభంలో తొలి వంద ఫీట్ల వరకు ఫీట్‌కు రూ.70గా నిర్ధారించగా... ఆ తర్వాత వందకు రూ.80 చొప్పున తర్వాతి వంద ఫీట్లపై రూ.100... ఇలా పెంచుతూ 900–1000 ఫీట్లలోతు తవ్వేందుకు ధర రూ.360గా ఖరారు చేసి వసూలు చేస్తున్నారు. 2019లో 900–1000 ఫీట్ల లోతు తవ్వేందుకు ధర రూ.200 చొప్పున మాత్రమే ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ.160 పెంచేశారు. మొత్తంగా వెయ్యి ఫీట్ల లోతుకు బోరు తవ్వేందుకు ఏడాదిన్నర క్రితం గరిష్టంగా 1.25 లక్షలు (కేసింగ్, చార్జీలన్నీ కలిపి) కాగా... ప్రస్తుతం రూ.2.30 లక్షలు అవుతోంది. 

డీజిల్, కూలీల ధరలు పెరగడం వల్లే.. 
డీజిల్‌ ధరలు ఏడాదిన్నర క్రితంతో పోల్చుకుంటే ప్రస్తుతం 25 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అదేవిధంగా లాక్‌డౌన్‌ తర్వాత లేబర్‌ షార్టేజీతో కూలీల ధరలు కూడా పెరిగాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే బోరు తవ్వకం ధరలు పెంచాం. – జె.గంగారెడ్డి, బోర్‌వెల్‌ నిర్వాహకుడు, బీఎన్‌ రెడ్డి నగర్, హైదరాబాద్‌ 

రెండేళ్లలో డబుల్‌ ఖర్చయ్యింది 
నాకున్న నాలుగున్నర ఎకరాల పొలంలో రెండేళ్ల క్రితం బోరు తవ్వించా. దాదాపు 900 ఫీట్లు వేశారు. అప్పుడు రూ.80 వేలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు పూర్తిగా వరి వేయాలను కోవడంతో ఒక్క బోరు సరిపోదని 15 రోజుల క్రితం మరొకటి తవ్వించా. ఇదివరకు తవ్విన వ్యక్తే 950 ఫీట్లు తవ్వి రూ.1.92 లక్షల బిల్లు చేతిలో పెట్టాడు. రెండేళ్ల వ్యవధిలో డబుల్‌ ఖర్చు పెట్టాల్సి వచ్చింది. – డి.లక్ష్మణరావు, రైతు, మాల్‌ గ్రామం, రంగారెడ్డి జిల్లా 

మరిన్ని వార్తలు