మంటగలిసిన మానవత్వం

30 Jul, 2020 07:30 IST|Sakshi

వృద్ధురాలి అంత్యక్రియలను అడ్డుకున్న స్థానికులు  

గుంతలో పెట్టిన శవాన్ని తీసి మరోచోట ఖననం 

గుత్తి: ఏ కారణంతో మరణించినా దహన సంస్కారాలు నిర్వహించడం ఆ కుటుంబం చావుకొస్తోంది. ఓ వృద్ధురాలు మరణిస్తే శ్మశాన వాటిక సమీపంలోని నివాసితులు అడ్డుకోవడం, చివరకు అక్కడి నుంచి మరోచోటుకు తరలించి ఖననం చేసిన ఘటన గుత్తిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. పట్టణంలోని జంగాల కాలనీలో ఒకే కుటుంబంలోని ఐదుగురికి కరోనా సోకింది. వీరంతా స్థానిక ప్రయివేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆ కుటుంబంలోని వృద్ధురాలు(62) బుధవారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో మరణించింది. దీంతో నలుగురు కుటుంబ సభ్యులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పీపీఈ కిట్లు ధరించి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలకు సిద్ధమయ్యారు.

వ్యాన్‌లో మృతదేహాన్ని తీసుకొచ్చి శ్మశానంలో తవ్విన గుంతలో పెట్టారు. పూడ్చే సమయంలో స్థానికులు ఒక్కసారిగా గుంపులు, గుంపులుగా వచ్చి అంత్యక్రియలను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పూడ్చడానికి వీల్లేదని మృతురాలి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. సమాచారం తెలుసుకున్న మున్సిపల్‌ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వార్డు వలంటీర్లు ఆ ప్రాంతానికి చేరుకుని స్థానికులకు నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. చేసేది లేక గుంతలో పెట్టిన శవాన్ని బయటకు తీసి గుంతకల్లు రోడ్డులోని ఓ ప్రాంతంలో జేసీబీ సహాయంతో 10 అడుగుల లోతు గుంత తీసి శవాన్ని ఖననం చేశారు. కరోనాతో మృతి చెందిన వారి నుంచి వైరస్‌ ఇతరులకు సోకే అవకాశం తక్కువని, మృతదేహంలో కేవలం నాలుగు గంటలకు మించి వైరస్‌ బతికే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నా ప్రజల్లో మానవత్వం మేల్కోని పరిస్థితి. 

మరిన్ని వార్తలు