హిందూధర్మానికి ఉనికి ఆదిశంకరాచార్యులే.. 

1 Feb, 2023 04:11 IST|Sakshi
స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకుంటున్న ఏపీ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌

విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి  

ఘనంగా ముగిసిన శారదాపీఠం వార్షికోత్సవాలు  

రాజశ్యామల అమ్మవారికి గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పూజలు

సింహాచలం: హిందూ ధర్మానికి ఉనికి జగద్గురు ఆదిశంకరాచార్యులే అని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపా­నం­దేంద్ర సరస్వతి చెప్పారు.  శ్రీశారదాపీఠంలో ఐదురోజులుగా జరిగిన వార్షికోత్సవాలు మంగళవారం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా జరిగిన శాస్త్ర, శ్రౌతసభల్లో స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడారు. ఆచార్యుల పేరుతో మధ్వాచార్యులు, రామానుజాచార్యులు ప్రచారం పొందినా ప్రపంచవ్యాప్తంగా ఆదిశంకరాచార్యులే తెలుసని చెప్పారు. శంకరాచార్య తత్వాన్ని కాపాడుతున్న శాస్త్ర పండితులతో ఏటా వార్షికోత్సవాల్లో శాస్త్ర, శ్రౌతసభలు నిర్వహిస్తున్నామని, బిరుదులిచ్చి స్వర్ణకంకణధారణ చేస్తున్నామని తెలిపారు.

హిందూధర్మం అంటే ఆలయాలు, అర్చనలే అని  సామాన్యులు భావిస్తారని, కానీ శాస్త్రం ఉంటేనే హిందూధర్మం నిలుస్తుందని తమ పీఠం నమ్ముతుందని చె­ప్పా­రు. రాజశ్యామల యాగం అంటే వ్యాపారం కాదన్నా­రు. అంగదేవతలతో కూడిన హోమాలు ఇందులో ఉంటాయన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరకు రాజశ్యామల కృపను పొందారని చెప్పారు.

ఈ సందర్భంగా శాస్త్రసభలో ప్రతిభకనబరిచిన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికి వ్యాకరణ భాస్కర బిరుదు ప్రదానం చేసి స్వర్ణకంకణధారణ చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి పర్యవేక్షణలో జరిగిన ఈ సభలో షట్‌శాస్త్ర పండితులు విశ్వనాథ గోపాలకృష్ణశాస్త్రి, చిర్రావూరి శ్రీరామశర్మ, ఓరుగంటి రామ్‌లాల్, మణిద్రావిడ శాస్త్రి, ఆర్‌.కృష్ణమూర్తి శాస్త్రి, ప్రముఖ శ్రౌత పండితులు దెందుకూరి రాఘవ ఘనాపాఠి పాల్గొన్నారు.  

ఆశీస్సులందుకున్న గవర్నర్‌ 
గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ శారదాపీఠంలో రాజశ్యామల అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.  స్వ­రూ­పానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సు­ల­తో రాష్ల్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.

వైభవంగా మహాపూర్ణాహుతి 
వైభవంగా జరిగిన రాజశ్యామలయాగం, శ్రీనివాస చతుర్వేద హవనం మహాపూ­ర్ణాహుతి కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టీటీడీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్‌ వై.వి.సుబ్బారెడ్డి దంపతులు, భీమిలి, పెందుర్తి ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అదీప్‌రాజ్, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్‌బాబు, విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, తెలంగాణకు చెందిన కంపెనీస్‌ లా ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బదరీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీటీడీ చైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ విశాఖ శారదాపీఠం చేస్తున్న ఆధ్యాత్మిక, సేవాకార్యక్రమాలు ఎంతో గొప్పవని చెప్పారు.   

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు