సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం

27 Aug, 2023 04:47 IST|Sakshi
వేదికపై హైకోర్టు న్యాయమూర్తులు, కలెక్టర్‌ 

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కృష్ణమోహన్‌

కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్‌బోర్డు ట్రిబ్యునల్‌ను ప్రారంభించిన జడ్జి

కర్నూలు (లీగల్‌): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జి జస్టిస్‌ బి.కృష్ణమోహన్‌ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్‌ కృష్ణమోహన్‌ ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్, సెషన్స్‌ జడ్జి ఎన్‌.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్‌ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్‌ మజీద్‌ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్‌ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్‌ కోర్టు పని చేస్తుందని చెప్పారు.

విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు ట్రిబ్యునల్‌ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్‌ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్‌వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కల్యాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు