కాళ్లకు నంబర్లతో ఆ పావురాలు ఎక్కడివి!

6 Jan, 2022 08:17 IST|Sakshi

ప్రకాశం జిల్లా చీమకుర్తి, పేర్నమిట్ట అపార్టుమెంట్లపై హల్‌చల్‌

స్థానికుల్లో ఆందోళన.. పోలీసులకు సమాచారం

చెన్నైకి చెందిన ఆల్‌ ఇండియా రేసింగ్‌ పీజియన్‌ సొసైటీకి చెందిన పావురాలుగా గుర్తింపు

చీమకుర్తి : ప్రకాశం జిల్లా చీమకుర్తి, పేర్నమిట్టల్లోని అపార్ట్‌మెంట్లపై వచ్చి వాలిన పావురాలు స్థానికుల్లో కలకలం రేపాయి. చీమకుర్తిలోని మన్నం నాగరాజు అపార్ట్‌మెంట్‌పై ఒక పావురం, పేర్నమిట్టలోని లింగా రెడ్డి అపార్ట్‌మెంట్‌పై మరో పావురం బుధవారం వచ్చి వాలాయి. వాటి కాళ్లకు ఏఐఆర్‌ అనే ఇంగ్లిష్‌ అక్షరాలతో పాటు 2207, 2019 అనే నంబర్లతో కోడ్‌లు రాసిన టాగ్‌లు ఉన్నాయి. 

ఒడిశాలోని పలు ప్రాంతాల్లో వాలిన పావురాలను చైనా దేశం నిఘా కోసం పంపినట్టుగా పత్రికల్లో వచ్చిన కథనాలను చూసిన స్థానికులు.. చీమకుర్తి, పేర్నమిట్టల్లో  ఉన్న పావురాలను చూసి ఆందోళన చెంది మీడియాకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో అవి చైనా పావురాలు కాదని, చెన్నైకి చెందిన ఆల్‌ ఇండియా రేసింగ్‌ పీజియన్‌ సొసైటీకి చెందిన పావురాలని తేల్చారు. ఆ సొసైటీ వారు పావురాలకు పోటీలు పెడుతుంటారని, వాటికి నంబర్లు ఇచ్చి పంపిస్తుంటారని ఎస్‌ఐ  ఆంజనేయులు తెలిపారు.  

మరిన్ని వార్తలు