చిట్టి ధాన్యం..గట్టి ఆరోగ్యం..!

29 Oct, 2022 09:54 IST|Sakshi

విజయనగరం: కొండ ప్రాంతాల్లోని గిరిజనులు  ఆకలి తీర్చుకొనడానికే సాగుచేసే గడ్డిజాతికి చెందిన తృణధాన్యాలలో విశేష గుణాలను గుర్తించిన ఆహార శాస్త్రవేత్తలు ప్రపంచానికి చిరుధాన్యాల ప్రాముఖ్యాన్ని చాటుతున్నారు. చిరుధాన్యాలైన కొర్రలు, సామలు, గంటెలు, రాగులు, జొన్నలు, ఊదలు, ఆరికెల సాగుపై మక్కువ పెంచుతున్నారు. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి చిరుధాన్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి. చిరుధాన్యాల సాగు వల్ల భూమి సారం పెరుగుతుంది. నీటి వినియోగం తక్కువగా ఉండి పర్యావరణానికి ఎలాంటి హానీ జరగదు. పోషక  విలువలను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023వ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్‌ ఇయర్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌గా ప్రకటించి చిరుధాన్యాల ప్రాముఖ్యతను చాటి ఉత్పత్తి పెంచడానికి ప్రోత్సహించింది. అతి తక్కువ పెట్టుబడితో పండించే మిల్లెట్స్‌తో అధిక ఆదాయం వచ్చే మార్గాలను పెంపొందించింది. 

మిల్లెట్‌ పాలసీ  
పోషక గనులున్న చిరుధాన్యాల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం మిల్లెట్‌ పాలసీ ప్రకటించింది. చిరుధాన్యాల సాగు పెంచేందుకు హెక్టారుకు రూ.6వేలు చొప్పున ప్రోత్సాహకం ప్రకటించింది. సాగు విస్తీర్ణం పెంచడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, మార్కెటింగ్‌ సౌకర్యంపై దృష్టి సారించింది.   

ఔషధ గుణాల సమ్మిళితం 
తృణధాన్యాలు ప్రకృతి ప్రసాదించిన వరాలు. ఔషధ గుణాల సమ్మిళితమైన ఆహారం. ఆరోగ్య గుళికలుగా వాటిని వరి్ణస్తారు. అవి  తింటూ ఆరు నెలల నుంచి  రెండేళ్ల లోపు వ్యాధులను నిర్మూలించుకోవచ్చు.  రోగ కారణాలను శరీరం నుంచి తొలగించి దేహాన్ని శుద్ధి చేస్తాయి. తృణధాన్యాలలోని పీచు పదార్థం శరీరానికి రక్షణగా నిలుస్తుందని న్యూట్రియన్స్‌ చెబుతున్నారు. ప్రభుత్వం అందసేస్తున్న ప్రోత్సాహాకాలతో పెరిగిన చిరు ధాన్యాల పంటను  మార్కెట్‌లోకి వినియోగం పెంచడానికి జీసీసీ ద్వారా కొనుగోలు చేసేందుకు   ఏర్పాట్లు సాగుతున్నాయి. చిరుధాన్యాలతో ఆహర పదార్థాల తయారీ, ముడి సరుకులను పుడ్‌ప్రోడక్ట్స్‌గా సిద్ధం చేయడం, దేవాలయాల్లో ప్రసాదాలకు అందించేందుకు మార్గం సుగమం చేసింది. చిరుధాన్యాల్లో కొర్రలను వినియోగిస్తే నరాల శక్తి మానసిక దృఢత్వం కలగడంతో పాటు ఆర్థరైటిస్, మార్ఛ రోగాల నుంచి విముక్తి కలుగుతుంది. అండు కొర్రల వినియోగంతో రక్తశుద్ధి జరిగి, రక్తహీనత పోయి, రోగ నిరోధక శక్తి పెంచి డయాబిటిస్, మలబద్ధకం నివారిస్తుంది. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్యలు దూరం కావడమే కాకుండా పీసీఓడీ, సంతాన లేమి సమస్యల నివారణకు పని చేస్తాయి.   ఊదలు వాడడం వల్ల లివర్, కిడ్నీ వ్యాధులు, కొలెస్టరాల్, కామెర్లు తగ్గించడంలో ఉపయోగపడతాయి. సామలు వినియోగం వల్ల అండాశయం, వీర్యకణాల సమస్య, పీసీఓడీ, సంతానలేమి సమస్యల నివారణకు దోహదంచేస్తుంది.   

అండుకొర్రలు: జీర్ణాశయం,ఆర్ద్రయిటీస్,బి.థైరాయిడ్, కంటి సమస్యలు, ఊబకాయం నివారణకు సహకరిస్తుంది. 
పెరుగుతున్న విస్తీర్ణం  పార్వతీపురం మన్యం జిల్లాలో మిల్లెట్స్‌ సాగు విస్తరిస్తోంది. ఇప్పటికే 3,750 ఎకరాల్లో సాగు విస్తురించే దిశగా చర్యలు తీసుకున్నారు.   

జీసీసీ బ్రాండ్‌తో మార్కెట్‌లోకి.. 
అత్యధిక పోషక విలువలు గల చిరుధాన్యాలకు ప్రాముఖ్యం లభించడంతో   జీసీసీ బ్రాండ్‌తో మిల్లెట్స్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాం.  జీసీసీ ఎం.డి ఆదేశాల మేరకు నాణ్యత గల చిరుధాన్యాల  కొనుగోలుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఆరోగ్య రక్షణలో చిరుధాన్యాల ఆవశ్యకత వివరిస్తున్నాం. గిరిజన రైతుల పండించే పంటలకు గిట్టుబాటు ధర చెల్లించడానికి రంగం సిద్ధం చేస్తున్నాం.  
గురుగుబిల్లి సంధ్యారాణి, జీసీసీ బ్రాంచ్‌ మేనేజర్‌ సీతంపేట  

మరిన్ని వార్తలు