ఏటా కొత్త వ్యాధికారకం!

6 Nov, 2023 02:42 IST|Sakshi

మూడు దశాబ్దాల్లో 30 వ్యాధికారకాల ఉద్భవం

వాటిలో ఎక్కువ శాతం వ్యాధికారకాలు జంతువుల నుంచి వచ్చి నవే 

ఏకీకృత కార్యాచరణతోనే అరికట్టవచ్చంటున్న డబ్ల్యూహెచ్‌వో 

సాక్షి, హైదరాబాద్‌: మానవాళికి అంటువ్యాధుల ముప్పు క్రమంగా పెరుగుతోంది. కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తి కారణంగా యావత్‌ ప్రపంచమంతా దాదాపు మూడేళ్లపాటు అతలాకుతలమైంది. వందల ఏళ్లుగా ఈ వ్యాధికారకాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ప్రస్తుతం వాటి సంఖ్య మరింత ఎక్కువవుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెబుతున్నారు. గత మూడు దశాబ్దాల్లో ఏకంగా 30 రకాల వ్యాధికారకాలు ఉద్భవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పరిశోధనలో తేలింది. ఈ లెక్కన ఏటా సగటున ఒక వ్యాధికారకం వెలుగులోకి వచ్చి ంది. అయితే ఈ వ్యాధికారకాల ఉద్భవంలో అత్యధికం జంతువుల నుంచే కావడం గమనార్హం. 

అడవుల నరికివేత, జంతువుల వలసలు... 
అంటువ్యాధుల కారకాలపై డబ్ల్యూహెచ్‌వో ఎప్పటి కప్పుడు పరిశోధనలు చేస్తూనే ఉంది. ప్రధానంగా జంతువుల నుంచే వ్యాపిస్తున్నవి 60 శాతంగా ఉంటున్నట్లు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా అడవుల నరికివేత వల్ల జంతువుల వలసలు పెరగడంతోపాటు అటవీ జంతువులను ఆహారంగా మార్చు కోవడం, జంతు ఉత్పత్తుల వాడకంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో గుర్తించింది.

మనుషుల ఆహార జాబితాలో గతంలో శాకాహార జంతువులే ఉండగా క్రమంగా మాంసాహార జంతువులూ చేరాయి. శాకాహార జంతువులతో పోలిస్తే మాంసాహార జంతువుల జీర్ణవ్యవస్థ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆహార అరుగుదల కోసం ఉపయోగపడే బ్యాక్టీరియా, ఇతరత్రా మానవ శరీరానికి ప్రమాదకారిగా మారుతున్న సందర్భాలున్నాయి. కోవిడ్‌–19 వైరస్‌ ఇదే తరహాలో ఉద్భవించిందనే వాదనలు సైతం ఉన్నాయి. ఎబోలా, రేబిస్‌ మొదలైన వైరస్‌లు ఈ కోవకు చెందినవే. 

కట్టడి కోసం ‘వన్‌ హెల్త్‌’.. 
డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం 2003 నుంచి ప్రపంచవ్యాప్తంగా అంటువ్యాధుల కారణంగా కోటిన్నరకుపైగా మరణాలు సంభవించాయి. అలాగే ప్రపంచ దేశాలు 4 ట్రిలియన్‌ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. జంతువుల నుంచి వచ్చే వ్యాధికారకాలను ఎదుర్కొనేందుకు, వాటిని నిలువరించేందుకు డబ్ల్యూహెచ్‌వో వన్‌హెల్త్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

ఈ కార్యక్రమంలో భాగంగా పర్యావరణ, జంతు సంరక్షణ సంస్థలు, వైద్య నిపుణులు, వెటర్నరీ నిపుణులు కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాల వల్ల జంతు వ్యాధికారకాలను నిలువరించవచ్చని డబ్ల్యూహెచ్‌వో చెబుతోంది. అంతేకాకుండా ఆర్థికపరమైన భారం కూడా తగ్గుతుందని భావిస్తోంది.

కోవిడ్‌పై పోరులో 28 విభాగాల కృషి 
కోవిడ్‌–19 వ్యాప్తి తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ద పెరిగింది. కోవిడ్‌ టీకాల కోసం దేశంలో 28 విభాగాలు సమన్వయంతో పనిచేసి అద్భుత ఫలితాలు సాధించాయి. పర్యావరణం, మొక్కలు, జంతువులు, మానవాళి మధ్య సంబంధాల్లో సమతౌల్యం ఎప్పుడూ పాటించాలి. దాని ఆమలుకు సంబంధించినదే వన్‌ హెల్త్‌ విధానం. డబ్ల్యూహెచ్‌వో రూపొందించిన ఈ విధానం వల్ల ఆర్థికంగా కలసిరావడంతో పాటు ఎక్కువ ఫలితాలు వస్తాయి. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ అంశం అన్ని దేశాలు పూర్తిస్థాయిలో అమలు చేసే స్థాయికి చేరుకుంటాయని ఆశిస్తున్నా. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, ఐఎంఏ సైంటిఫిక్‌ కమిటీ కన్వినర్‌

మరిన్ని వార్తలు