అడుగులో అడుగై.. అమ్మలా తానై

9 Jan, 2022 11:47 IST|Sakshi
భర్తకు అన్నం తినిపిస్తున్న విమలా వసుంధరాదేవి

నడవలేని స్థితిలో భర్త 

సపర్యలు చేస్తున్న సహచరి 

ప్రధానోపాధ్యాయురాలిగా బాధ్యతల నిర్వహణ 

ఆదర్శంగా నిలుస్తున్న విమలా వసుంధరాదేవి

గడివేముల: వారిద్దరూ భార్యాభర్తలు..కష్టసుఖాల్లో తోడునీడగా ఉన్నారు. ఉన్నట్టుండి వారి జీవితంలో ఒక ఉపద్రవం వచ్చి పడింది. అనారోగ్యంతో భర్త అచేతన స్థితిలోకి వెళ్లారు. దీంతో భార్య అమ్మలా మారారు. భర్తకు అన్ని సపర్యలు చేస్తున్నారు. ఆకలేస్తే అన్నం తినిపిస్తున్నారు. బాధ వస్తే ఓదార్చుతున్నారు. కన్నీళ్లు వస్తే తుడుస్తున్నారు. ఏదైనా ప్రదేశాన్ని చూడాలనిపిస్తే కారులో తీసుకెళ్తున్నారు.

చదవండి: పరీక్ష ఫలితాల వెల్లడిలో జేఎన్‌టీయూ(ఏ) కొత్త ఒరవడి

తన భుజం సాయంతో భర్తను నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. మాలిన్యం లేని ఆమె   మంచితనం...భర్త మనసు తెలిసి మసలుకునే లాలిత్యం ఆదర్శంగా నిలిచాయి. అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్న వృద్ధ తల్లిదండ్రులను రోడ్డుపై వదిలేస్తున్న ఈ రోజుల్లో భర్తకు అమ్మలా సేవలు చేస్తున్న గడిగరేవుల జిల్లా పరిషత్‌ హైసూ్కల్‌ ప్రధానోపాధ్యాయురాలు వసుంధరా దేవి స్ఫూర్తిగా నిలిచారు.

నంద్యాల మండలం పులిమద్ది గ్రామానికి చెందిన అరవింద పంచరత్నంతో కర్నూలుకు చెందిన ఈమెకు 40 ఏళ్ల క్రితం వివాహమైంది. పంచరత్నం గ్రామంలో వ్యవసాయం చేసేవారు. విమలా వసుంధరాదేవి ఉపాధ్యాయురాలుగా పనిచేసేవారు. వీరు నంద్యాలలో స్థిరపడ్డారు. వీరికి ఒక కుమారుడితోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె డాక్టర్‌గా, మరో కుమార్తె, కుమారుడు బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారికి పెళ్లిళ్లు సైతం అయ్యాయి. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలో మధుమేహ వ్యాధితో పంచరత్నం కాళ్లు చేతులు చచ్చుబడి నడవలేని స్థితిలోకి వెళ్లారు.

షుగర్‌ వ్యాధి తీవ్రత అధికం కావడంతో ఆయన ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచి నడవలేని స్థితిలో ఉన్న భర్తకు విమలా వసుంధరాదేవి అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రధానోపాధ్యాయ బాధ్యతలు నిర్వర్తిస్తూనే భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఎప్పటికప్పుడు షుగర్‌ స్థాయిని పరీక్షిస్తూ..సమయానికి మాత్రలు ఇస్తున్నారు. తనతో పాటు కారులో పాఠశాలకు తీసుకెళ్లి, మధ్యాహ్న సమయంలో గోరుముద్దలు తినిపిస్తూ చిన్నపిల్లాడిలా భర్తను చూసుకుంటున్నారు. కుమారుడు, కుమార్తెలు దూర ప్రాంతంలో ఉన్నారని, భర్తకు సపర్యలు చేయడంలో తాను ఆనందాన్ని వెతుక్కుంటున్నానని విమలా వసుంధరాదేవి తెలిపారు.


 

మరిన్ని వార్తలు